*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 094*
 *ఉత్పలమాల:*
*జీవన మింకఁ బంకమున | ఁజిక్కిన మీను చలింప కెంతయున్*
*దావుననిల్చి జీవనమె | దద్దయు, గోరువిధంబు చొప్పడం*
*దావలమైనఁగాని గురి | తప్పనివాఁడు తరించువాఁడయా*
*తావక భక్తియోగమున | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
నీరు ఇంకి పోయిన చెరువులో బురదలో వున్న చేప, తాను బురదలోనే వుండి, నీటిని కోరుకుంటుంది. అలాగే, ఎవరికైనా స్థానబలిమిని ఇవ్వగలిగిన నీ భక్తిలో మునిగి తేలే వాడు నీ భక్తిని మరవకుండా వుండటం వలన తరించుతాడు!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*మన జన్మ సార్ధకం చేసుకోవడానికి ఉపయోగపడేది నామస్మరణ మార్గమే అని తెలుసుకుని, నమ్మి ఆ మార్గంలో వెళ్ళే వారు ఎప్పటికీ పరమేశ్వరునికి ఇష్టమైన పరమ భక్తులుగానే వుంటారు. సర్వకాల సర్వావస్థలలో కూడా "స్మరణాత్ కైవల్యం" అనే సూత్రాన్ని వదలకుండా పట్టుకుని వుండాలి. మనం నడుస్తున్నా, ఆఫీసులో పని చేస్తున్నా, మరి ఏ ఇతర పని చేస్తున్నా, హరి హర నామస్మరణ మరవక చేస్తూ వుండటం మనకందరకు శ్రేయస్కరం. ఇలా అన్ని వేళలా హరుని యందే మనసు లగ్నం అవ్వాలి అంటే సద్గురువు కృప కూడా మనకు వుండాలి. ఎందుకంటే, గురువు రూపంలో ఉన్న శివుడు మనం వెళ్ళ వలసిన దారిలో మాత్రమే మనల్ని నడిపిస్తాడు. ఇటువంటి సద్గురువు పాలనలో వుండి, మనం నిత్యం హరి స్మరణ మార్గంలో ఉండేటట్లు మనల్ని ఆ హరిహర రూపమే అనుగ్రహించాలని మనసులో వేడుకుంటూ..........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు