*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 095*
 *చంపకమాల:*
*సరసుని మానసంబుసర | సజ్ఞుడెరుంగును ముష్కరాధముం*
*డెరిఁగి గ్రహించువాడె కొల | నేక నివాసముగాఁగ దర్దురం*
*బరయగ నేర్చునెట్టు విక | చాబ్జ మరందరసైక సౌరభో*
*త్కరముమిళింద మొందుక్రియ | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
అందమైన భావములు గల మనిషి యొక్క మనసును ఇంకొక అందమైన భావములు కలిగిన మనసు వున్న మనిషికే తెలుస్తుంది కానీ, చెడు ఆలోచనలు, భావనలు కలిగిన దుర్మార్గునికి తెలియదు. ఎలాగంటే, ఎల్లప్పుడూ బావిలోనో, చెరువులోనో మాత్రమే ఉండే ఒక కప్పకు, విరబూసిన కమలముల మీద దూరనుండి తిరిగుతూ అయినా కూడా, ఆ కమలముల తేనెను ఆస్వాదించే తుమ్మెద ఆనందము తెలియదు, కదా!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*నిన్ను నమ్మి, నీ పేరు పలికేడప్పుడు నీ భక్తుడు పొందే మానసిక ఆనందము, శ్రవణానందము అతనికే తెలుస్తుంది కానీ, ఇతరులకు ఎలా తెలుస్తుంది. తెలియదు, కాక తెలియదు. ఒక ప్రహ్లాదుడు, ఒక మంజునాథుడు, ఒక ఆంజనేయస్వామి, ఒక భక్త తుకారాం, ఒక మార్కండేయుడు వీరి చరిత్రలు  నామస్మరణలో పొందగలిగే ఆనందాన్ని మనకు పరిచయం చేసారు. నీ స్మరణ వల్ల వచ్చే ఫలితాన్ని తాము అనుభవించి లోకానికి పరిచయం చేసారు. కానీ, మనం ఆ స్మరణాత్ కైవల్యం అనే విషయాన్ని ఒప్పుకుని, మనం పాటించి, మన తరువాత తరానికి ఆ దివ్యానుభూతిని వారసత్వంగా ఇవ్వగలిగే పని చేస్తున్నామా? ఇంత చక్కని నామస్మరణ ఆనందాన్ని మనం పొంది, వారసత్వంగా ఇవ్వగలిగే సామర్థ్యాన్ని మనకు ఇవ్వమని ఆ చంద్రచూడుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ.........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు