*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 098*
 *ఉత్పలమాల:*
*ఎంతటి పుణ్యమో శబరి | యెంగిలిగొంటివి వింతగాదె నీ*
*మంతన మెట్టిదో యుడుత | మేని కరాగ్ర నఖాంకురంబులన్*
*సంతసమంద జేసితివి | సత్కుల జన్మము లేమి లెక్క వే*
*దాంతము గాదె నీ మహిమ | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
ఎంత వింత కాకపోతే, శబరి ఎంగిలు చేసిన పళ్ళను నీవు తిన్నావు. ఆ శబరి చేసిన పుణ్యము ఎంత గొప్పదో కదా! ఉడుత, నీకు చేసిన చిన్న సహాయానికి నీ సంతోషాన్ని నీ చేతి వేళ్ళ కొసలతో ఉడుత శరీరాన్ని నిమిరి ఆ ఉడుతకు ఆనందాన్ని కలిగించావు. నీ మహిమ తెలుసుకో లేని వాళ్ళు ఎంత ఉత్తమ కులములో పుట్టినా, ఎన్నో వేద వేదాంతాలు చదివిన పండితులైనా ఎందుకు పనికిరారు!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"చాతుర్వర్ణా మయా కృతా" అన్నాడు భగవానుడు. అటువంటప్పుడు, తానే సృష్టించిన వర్ణాలలో పుట్టిన మనుషుల మీద ఆ భగవానునికి భేద భావం ఎందుకు ఉంటుంది. కులము, మతము, జాతి తేడాలు, ధనవంతులు, పేదవారు ఈ తేడాలు అన్నీ మన మనుషులకే, ఎప్పుడు మర్చిపోతామో ఏమో. పరమాత్మ తన ప్రతీ లీలలో నాకు అందరూ సమానమే, అంతా నాలో నుండి వచ్చిన వారే అని గుచ్చి గుచ్చి చెపుతానే, చూపిస్తానే వున్నారు. కానీ, మనమే. ఈ తేడాలను గుర్తించి, మరచిపోయి, మనలో నుండి చెరిపేసుకుని అందరమూ "మనమందరం" గా కలసి ప్రయాణించే అవకాశం ఇవ్వమని, ఇచ్చి మనల్ని కాపాడి, చివరి ప్రయాణంలో కూడా చేదోడు వాదోడుగా ఉండాలని, ఉండమని ప్రార్థిస్తూ.........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు