*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 101*
 *చంపకమాల:*
*తరువులు పూచికాయలగు | దత్కుసుమంబులు పూజగా భవ*
*చ్ఛరణము సోఁకి దాసులకు | సారములౌ ధనధాన్యరాశులై*
*కరిభట ఘోటకాంబర ని | కాయములై విరజానదీ సము*
*త్తరణ మొనర్చుఁజిత్రమిది | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
చెట్లకు పూవులు పూస్తాయి. కాయలు కాస్తాయి. ఆ చెట్లకు పూచిన పూలు నీ పూజలో నీ పాదాల వద్దకు చేరుతాయి. అలా నీ ఫుజలో నీ ఫాదాలను చేరిన పూలు నీ భక్తలకు ఎంతో గొప్పవైన డబ్బు, సంపదలు, ఏనుగులు, గుర్రములు, బంటులను ఇస్తుంది. ఇంకా విరజా నది తరువాత ఉన్న మోక్షమును కూడా ఇస్తుంది, ఎంత చిత్రమో కదా!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*రామచంద్ర ప్రభో! నీ దయ, కరుణ, అనుగ్రహం పొందడానికి పెద్ద పూజలు, వ్రతాలు చేయవలసిన పని లేదని నీవే చెప్పావు కాదా! తృణమో, ఫలమో, పత్రమో, జలమో నీ మీద భక్తిని మనసునిండా నింపుకుని సమర్పిస్తే మోక్షమే ఇస్తాను అన్నావు, స్వామీ! కానీ మాకు ఈ విషయం అర్థం కాలేదు. అందుకని, ద్వాపరయుగంలో రుక్మిణీ, సత్యభామ ల మధ్య సంవాదం రూపంలో రుక్మిణి వేసిన తులసి ఆకు బరువుకు నీ బరువును సరిపెట్టి తులాభారం తూగావు కదా, ముకుందా! అది నీ మహిమ కాకపోతే, తులసి అకు నిన్ను ఎలా తూచ గలుగుతుంది. ఇక్కడ తూచింది తులసి ఆకు కాదు, ఆ అకు వేసిన రుక్మిణీ దేవి భక్తి శక్తి. కాబట్టి, అచంచలమైన భక్తి కలిగిన వారు ఎవరైనా నిన్ను తప్పక గెలవ గలుగు తారు. అటువంటి అచంచలమైన భక్తి నీపై మాకు అందరికీ కలిగేటట్టు నీవే అనుగ్రహించి, నిన్ను మేము మరవకుండా ఉండేటట్లు నీవే కాపుకాయి, కాత్యాయనీ పతీ!........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు