తరాల మార్పు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మానవ మస్తిష్కం  అందరికీ ఒక మాదిరిగానే ఉండదు  ఒకే వస్తువును చూసిన భిన్న వ్యక్తులు భిన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు తప్ప ఏకాభిప్రాయం కుదరదు కారణం ఎవరి అభిరుచి వారికుంటుంది  నిజమైన అందమైన ఆడపిల్ల బజారులో వెళుతున్నప్పుడు ఆమెను చూసి చాలామంది చాలా బాగుంది అని ముచ్చట పడతారు. కొంతమంది అరే బాగుంది అయితే కొంచెం ఎత్తు ఉంటే బాగుండేది కొంచెం లావుగా ఉంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది  అనేవారు లేకపోలేదు కనుక ఏ ఒక్కరి అభిప్రాయాన్ని  మనం  అంగీకరించలేం. మనం భోజనం చేసేటప్పుడు అమ్మ రకరకాల పద్ధతులలో  రకరకాల కూరలు వండి పెడుతుంది. ఇవాళ వండిన కూర రేపు వండదు  ఇవాళ ఇగురు చేస్తే రేపు పులుసు మరోరోజు కలగలుపు ఇలా రకరకాలుగా చేస్తుంది.
అమ్మ ఒక ఆకుకూరతో  కొత్తరకంగా వండింది అనుకున్నాం సామాన్యంగా  పిల్లలు తినడానికి ముందుకు రారు అందుకని అమ్మ ముందే చెప్తుంది నాన్నా ఇది మన దొడ్లో వచ్చిన తోటకూర నీకు చాలా బాగుంటుంది, అని విషయాన్ని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. మరి అమ్మ చెప్పిన తర్వాత ఏ బిడ్డ అయినా తినకుండా ఉంటుందా. ఇక్కడ రుచి అన్నది ప్రధానం కాదు  ఒక్కొక్కసారి బాగా ఎక్కువ రుచిగా వుంటే కొంచెం ఎక్కువగా మనం తింటాం  తక్కువ రుచిగా ఉన్నదాన్ని  కొద్దిగా తింటాం అదే మనకు ఇష్టం లేనిదైతే అసలు దాని వరకు వెళ్ళం.  ఈ మూటిని వండిన అమ్మ  ఆ రోజుకు ఆ కూర అయిపోయేలా చూడాలి కదా  నిలువ ఉంటే మళ్ళీ వీళ్లే పాచి కూర పెడతావా అని ఎద్దేవా చేస్తారు  ఆ స్థితి రాకుండా కూర ఖర్చు కావాలి  దానికి అనుగుణమైన మాటలు చెప్పి  అవసరమైతే తినిపిస్తుంది కూడా.
అమ్మ హయాం దాటి  కూతురు వంట చేసే స్థితికి వస్తే  ఎవరి వంట బాగుందని చెప్తాం తప్పకుండా తన తోబుట్టువు చేసిందే చాలా బాగుంది అని దీనికి మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారు అంటే  మొదటి తరం నుంచి రెండో తరం రెండో తరం నుంచి మూడో తరం వచ్చేసరికి  ఎప్పటికప్పుడు అభివృద్ధి మారుతూ ఉంటాయి  దానికి తగినట్లుగా తగిన పాళ్లలో పదార్థాలను తయారు చేస్తారు  అదే మనవరాలు చేసింది అనుకుందాం మీ అమ్మకు మీ అమ్మమ్మకు కూడా ఈ రుచి రావడం లేదమ్మా వంటలు ఎలా చేయాలో వాళ్లకు నేర్పు  అని వాళ్ళ ఎదురుగానే  ఎద్దేవా చేస్తాడు. అప్పుడు నాన్నకు బాగా చనువుగా ఉన్న కూతురు అంతేలే నాన్న  అసలు కన్నా వడ్డీ ముద్దు కదా అందుకే మనవరాలు ఆవిడ చేస్తే అమ్మో ఎంతో గొప్పగా ఉందని రుచులు గొప్పవని అంటావు. నేను రేపటి నుంచి వంట చేయడం మానుకుంటాను  అని బుంగ మూతి పెడుతుంది. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటివి సర్వసాధారణ విషయాలు  దీనివల్ల ఎవరికి ఎవరి వల్ల కోపాలు ఉండవు  అంతా సరదాగానే తీసుకుంటారు  అది సహజం కూడా.


కామెంట్‌లు