నాకే తెలియని నేను;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 గుండె సముద్రంలో 
తవ్వకాలు జరిపి
ఏవో కొన్ని బయటకు తీశాను....
పనికిరాని వాటిని 
పోగుచేసి దూరంగా విసిరేసాను....
విలువైన జ్ఞాపకాలను 
మాత్రం వెంటబెట్టుకుని, రేవుకు ఒంటరిగా చేరుకున్నాను...
కాలికి తగిలిన గవ్వలతో
బాల్యాన్ని పోగు చేసుకున్నాను...
అలల రాగాన్ని 
పాదాల వేళ్ళతో శృతి చేశాను...
గాలి గంధాలను
శ్వాసించి 
నీటి అనురాగాన్ని
రుచి చూసాను...
ఇసుకదిన్నెల పై తలను 
వాల్చి
చూపును ఆకాశానికి ఎగరేసాను....
మౌనాన్ని గానం చేస్తూ
నిశబ్దాన్ని కౌగిలించుకున్నాను...
రెక్కలు లేని చుక్కలు 
వచ్చి చీకటి చెట్టుపై 
వాలాక...
కలతల నలతలనన్ని
కన్నీటితో కడిగేసి...
నాతో నేను 
సహజీవనానికి సిద్ధమై
ఓ కొత్త ఉదయం వెంట పరుగులు తీశాను...


కామెంట్‌లు