ఉద్యమాల ఉపాధ్యాయుడు;- ప్రమోద్ ఆవంచ--7013272452

పగలంతా కూలీ పనులు, వ్యవసాయ పనులు చేసుకునే వారందరికీ చదువు చెప్పే ఉద్దేశ్యంతో జాతీయ సాక్షరతా మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వయోజన విద్య పేరుతో, రాత్రి బడులను నిర్వహించేవారు.ఆ రాత్రి బడులను నిర్వహించేందుకు  ప్రభుత్వం అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో,జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ను, కోఆర్డినేటర్లను,నియమించి, వాళ్ళ అండర్ లో టీచర్లను కూడా నియమించింది.ఆ టీచర్ల
నియామకంలో, ఆయా గ్రామాల్లో నిరుద్యోగ యువతకు
ప్రాధాన్యం ఇచ్చేవారు.1983 సంవత్సరంలో ప్రారంభమైన ఈ రాత్రి బడులు ఒక పదిహేనేళ్ల పాటు అంటే 1998 వరకు మనుగడలో ఉన్నాయి.ఆ తరువాత 2000 వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక మండల లిటరసీ ఆఫీసర్ ను నియమించి,మద్యలో చదువు ఆపేసిన పిల్లలు,పనులు చేసుకునే పిల్లలకు చదువు చెప్పే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.ప్రస్తుతం ఇది కొనసాగుతుందో లేదో తెలియదు......కట్ చేస్తే.....
                     నకిరేకల్ మండలం మాధవరం కలాన్
ఆ ఊరిలో ఒక స్కూల్.అక్కడ పనిచేసే తెలుగు ఉపాధ్యాయుడు పాలకుర్తి కృష్ణమూర్తి గారు.ఆయన ఉద్యమాల ఉపాధ్యాయుడు, టీచర్ల హక్కుల గురించి,వాళ్ళను,పై అధికారులు పెట్టే వేధింపులకు వ్యతిరేకంగా తాను పదవీ విరమణ చేసినంత కాలం పోరాటం చేసారు.యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ( యు.టి.ఎఫ్.),సీపిఎం పార్టీ అనుబంధ సంస్థ.నాకు మొదట్లో కమ్యూనిస్టు పార్టీల మీద ఒక దురభిప్రాయం
ఉండేది.కానీ పితృ సమానులైన కృష్ణమూర్తి గారిని,ఆ కుటుంబాన్ని చూసాక, తెలిసింది,నా అభిప్రాయం తప్పని.ఆ అవకాశం కలగడానికి కారణం శ్రీనివాస మూర్తి,ఆయన మూడవ
కుమారుడు.సీను నాకు ఆత్మీయ మిత్రుడు.నేను ఆ సాన్నిహిత్యంతోనే పంతులు అని పిలుస్తుంటాను, సీను కూడా నన్ను అలాగే పిలుస్తుంటాడు.
                   విషయానికి వస్తే, కృష్ణ మూర్తి గారు,ఒక క్రమశిక్షణ గల ఉపాధ్యాయుడు.స్కూలుకి పది నిమిషాల ముందే
వెళ్ళడం, స్కూలు వదిలాక అర్ధగంట తరువాత ఇంటికి వెళ్ళడం ఆయన చేస్తుంటారు.మాటల సందర్భంలో ఆయన ఎప్పుడో చెప్పిన మాటలు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి.పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ద లేకపోయినా, వాళ్ళలో క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత, నేర్పించడానికి నేను రిటైర్ అయ్యేంత వరకు,ఆ తరువాత కూడా ప్రయత్నించాను... ఇప్పటికీ
ఊరికి ఎప్పుడు వెళ్ళినా పిల్లలకు అదే విషయం చెపుతాననీ, చెప్పారు...అది ఆ తరం ఉపాద్యాయులలో,అంకిత భావం, గురువుగా  బాధ్యతలను నిర్వహించడం,తీసుకున్న జీతానికి
న్యాయం చేయాలన్న ఆలోచన,పిల్లల ఆలోచనలో మార్పు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం.తానునుకున్న
మార్పు జరగాలంటే,అందరూ చదువుకోవాలి.అందరూ అంటే, పిల్లలు,పెద్దలు,ఆడ,మగ అంటూ తేడా లేకుండా చదువుకోవాలనీ,వాళ్ళను ఆ దిశగా తీసుకెళ్ళేందుకు కృష్ణమూర్తి గారు,చేసిన ప్రయత్నం అసాధారణం.
ప్రతి రోజూ ఏదో ఒక సమస్య,అది జిల్లా పరిషత్ ఆఫీసులోనో,లేక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోనో, టీచర్లు... వాళ్ళ హక్కులకు భంగం కలిగించే,ఏదో ఒక  సమస్య వస్తుండడం సహజం.
 అలాంటి సమస్యలను యూటీఎఫ్ సంఘ నాయకుడిగా టీచర్లతో సమన్వయం చేసుకుంటూ, వాళ్ళ సమస్యలను,తెలుసుకుంటూ, నాకు తెలిసి ఆయన అటు ప్రభుత్వంతోనూ,ఇటు ప్రభుత్వ అధికారులతో,అలుపెరుగని పోరాట చేసారు.యుటీఎఫ్ రాష్ట్ర నాయకుడిగా ఆయన చేసిన
 పోరాటాల గురించి మళ్ళీ ప్రత్యేకంగా రాస్తాను....కట్ చేస్తే....
                గ్రామాల్లో వయోజన విద్య సెంటర్స్ స్థాపించే కార్యక్రమం అప్పట్లో ముమ్మరంగా సాగుతోంది.కృష్ణమూర్తి గారు,తన ఊరైన మాధారం( మాధవరం)లో కూడా వయోజన విద్య సెంటర్ నీ,నెలకొల్పాలనీ,ఆ ప్రాజెక్టు ఆఫీసర్ నీ,కోరాడు.దానికి ఆయన మీ ఊర్లో లిటరసీ శాతం ఎక్కువగా ఉంది.అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువున్నారు, అందుకే మీ ఊరికి స్కూలు మంజూరు
 కాలేదు,అని అన్నారు.నిజమే కానీ వ్యవసాయ కూలీలు,ఇతర పనులకు వెళ్ళే కార్మికులు, మేకలు,బర్రెలను కాసే ఆడ,మగ పిల్లలు,దొరలు, పెత్తందార్ల దగ్గర పనిచేసే జీతగాండ్లు ఇలా చాలా మంది, నిరక్షరాస్యులు మా ఊరిలో ఉండగా,మా ఊరికెందుకు మంజూరు చేయలేదని ఆ అధికారిని, కృష్ణమూర్తి గారు నిలదీశారు.దానికి,ఆ అధికారి, పైనుంచి మాకున్న ఆర్డర్ల ప్రకారం మేం నడుచుకుంటున్నాం సార్,అంటూ తప్పించుకున్నాడు.
ఇక చేసేది లేక తానే స్వయంగా రాత్రి బడిని, స్థానిక 
ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు.ఊర్లో టీచర్ ట్రైనింగ్ అయి నిరుద్యోగులుగా ఉన్న కొంతమంది యువకులతో,సమావేశమై, వాళ్ళకు పరిస్థితి వివరించారు.ఊరి కోసం ఫ్రీగా చదువు చెప్పేందుకు ఆ యువకులు ఒప్పుకున్నారు.అంతే అలా ఇద్దరితో మొదలైన రాత్రి బడి, రెండు వందల మందికి చేరింది.
ఆడ,మగ,పిల్లలు,వృద్దులు రెట్టింపు ఉత్సాహంతో రాత్రి బడికి రావడం మొదలు పెట్టారు.ఆ తరువాత ఆ ఊర్లో పరిస్థితులు,మారి పోయాయి...కట్ చేస్తే..
                   వ్యవసాయ కూలీలు,దొర దగ్గర జీతగాండ్లు, మేకలను,బర్రెలను కాసే పిల్లలు, వాళ్ళ పేరును, వాళ్ళు రాసుకునే స్థితికి వచ్చారు.దొరలు ఇచ్చే
జీతం డబ్బులకు లెక్కలు అడగడం ప్రారంభించారు.మెల్లమెల్లగా కొందరు న్యూస్ పేపర్ కూడా చదవగలుగుతున్నారు.నిషిద్ద సంస్థలకు ఎదురు
తిరగసాగారు.గ్రామ సర్పంచ్ నీ, అభివృద్ధి విషయంలో
నిలదీయడం ప్రారంభించారు.
                  మాధారం (మాధవరం కలాన్), ఇటుకులపాడు,చిత్తలూరు ఈ మూడు ఊర్లు ఆ రోజుల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు.నకిరెకల్ నుంచి కడపర్తి,పెరిక కొండారం తరువాత మాధారం స్టాపు. రోడ్డు పక్కన,కట్టకింది నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడుస్తే ఊరు వస్తుంది.ఆ ఊర్లో నుంచే ఇటుకలపాడు,
చిత్తలూరు గ్రామాలకు దారి...కట్ చేస్తే..
                     కృష్ణమూర్తి గారు చదువు నేర్పించి అందరినీ బాగుచేయాలనుకోవడం,అక్కడ వున్న రెండు వర్గాల వారికి మింగుడు పడలేదు.ఒకటి దొరల వర్గం, మరొకటి
నిషిద్ధ సంస్థల వర్గం.చదువు రాని వాళ్ళు చదువు నేర్చుకొని, మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వచ్చారన్న కోపం
వారికుండేది.సార్ వాళ్ళకు చదువు చెప్పి తప్పుచేస్తున్నారు .... అని బెదిరించేందుకు ప్రయత్నించారనీ ఆయన చెప్పారు.కానీ ఆయన ఏ బెదిరింపులకు భయపడలేదు.ఇక ఫ్రీగా చదువు చెప్పిన నిరుద్యోగ యువకులకు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రోత్సాహక సర్టిఫికేట్లు ఇప్పించారు కృష్ణమూర్తి గారు.డిఎస్సీ వ్రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి జిల్లా విద్యాశాఖాధికారితో ఇంటర్వ్యూ ఉండేది.ఆ ఇంటర్వ్యూ లో ఆ యువకులకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను టీచర్లుగా సెలెక్ట్ చేసారు....కట్ చేస్తే.
                నకిరేకల్ కి పని మీద వెళ్ళేందుకు కృష్ణమూర్తి గారు చెరువు కట్ట కింది నుంచి నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చి,నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు.రోడ్డు మరో
వైపు నుంచి ఒక బర్రె.... దాని నల్లని శరీరం నిండా చాక్ పీస్ తో రాసిన అమ్మ..ఆవు .. ఇల్లు...ఈగ..అనే అక్షరాలు..ఆ బర్రె మీద కూర్చుని ఒక కుర్రాడు రెండు చేతులతో కర్రను భుజాలపై పెట్టుకుని, ఏదో కొన్ని అక్షరాలు నేర్చుకున్నానన్న,తనలోనీ సంతోషాన్ని,ఇంకేదో సాధించానన్న ఆత్మ విశ్వాసాన్ని,తనకే తెలియని మనో ధైర్యాన్ని,తన ముఖంలో విప్పారిన నవ్వులో, లేత పూవులా,తన బోసి నవ్వుతో,ఆ కుర్రాడు పాలకుర్తి కృష్ణమూర్తి గారికి
అభివాదం చేస్తూ,సాగిపోతుంటే,ఆ పెద్దాయన కళ్ళల్లో
తడి,మెరుపై మెరిసింది,తన ఆశయం నెరవేరందన్న సంతృప్తితో నకిరేకల్ బస్సు ఎక్కాడు.
                     
కామెంట్‌లు