యోగఫలం;-కథ --( పద్యాలలో)-మమత ఐలహైదరాబాద్9247593432
 *కథ*
 ఆ.వె
పూర్వజన్మ క‌ర్మ పుణ్యమైననుగాని
పాపమైనఁ గాని వదలకుండ
వెంబడించునంట వేణునాథున్నైన
దైవ నిర్ణయమని ధరణ లేదు
ఆ.వె
చేయునట్టి పనులు సెలయేరు విధముగా
ఘనులజేయునట్టి కథను వినగ
పూర్వమందునొక్క పురములోబాలుడు
తుంటరి పనులెల్ల వొంటబట్టి
ఆ.వె
పెద్ద చిన్న యనక ప్రేమంటెయెరుగక
కోతి పనులతోడ రీతిదప్పి
దారికడ్డునిలచి వీర ప్రతాపంబు
జూపుచుండె నెపుడు పాపివోలె
తే.గీ
దివ్యమైనట్టి రేఖలు దిశను మార్చ
కరమునందునన్ గలవని నెరుగడితడు
మౌని యొకనాడు బోవగా మార్గమందు
చెంత చేరగా వచ్చెనీ చిలిపి కందు
తే.గీ
దుడుకు తనముతోయున్న యా పడుచువాన్ని
చూసి జాతకంబునుజెప్పె చిత్రముగను
నాగరా మహర్జాతక ననుచు మౌని
మొదలు బెట్టగన్ నిలబడె మొరటు వాడు
తే.గీ
స్వామి యేమంటిరిప్పుడు సత్యమేన
చెప్పు మరియొక్కమారని చేయిజూపె
నిక్కముగ జెప్పుచుంటిని నీదురాత
మంచి యోగంబు యుండెను మరువకనెను
ఉ.
ఎప్పుడు వచ్చునయ్య మరి యిప్పుడె జెప్పిన బాటవీడెదన్
యప్పటి దాకవీడనని యడ్డమునిల్వగ మౌనిబల్కెనే
తప్పక నాచరించినను ధన్యుడవైదువు జూడుమాయనన్
చెప్పుమటంచు చిత్తమని చేతులు గట్టెను మౌనిముందరన్
ఉ.
అక్కడ గుట్టకానుకొని యద్బుతలింగము నుండెజూడుమా
చక్కగ శుద్ధి జేసి శివ సాధనజేయుచు నిత్యమందునన్
మక్కువతోడసేవలొక మాస మొనర్చగ మంగళంబుగన్
దక్కును సత్ఫలంబులగు ద్రవ్యము గాంచగ సంతసింతువే
క.
అని మౌనిహితముదెలపగ
విని తరలెను గుట్టవైపు వేగిరమందున్
తనవును మరిచే విధముగ
పని గట్టుక శుద్ధి జేయ పాపడు బూనెన్
క.
తుంటరి తనమును మరిచెను
గంటల కొలదిగ పనులను ఘనముగ జేసెన్
గుంటడు సద్గుణ వతుడై
కొంటె తనములాగిపోయి కొలిచెను శివుడిన్
క.
తిప్పలనుచు భావించక
ముప్పది దినములను మరచి పూజనమునుగన్
టప్పు మనెడి శబ్దముతో
నప్పుడు నలువైపులందు నాగక జూడన్ 
క.
ప్రక్కనె గుట్టకు దాపున
చెక్కుమనుచు మెరియుచుండె చిత్రము తోడన్
మక్కువతో జూడగనే
చుక్కల మణిరత్నమాల చూపుకు తగిలెన్
క.
టక్కున కరముతొ బట్టెను
దక్కిన ఫలితంబునుగొని దారిని బట్టన్
నక్కట యెదురుగ వచ్చెడి
దిక్కున యా మునిని గాంచి ధీమగ జూపన్
క.
చెప్పితి గదనేనప్పుడు
తప్పులు జేయక మెదిలిన ధన నిధులన్నో
యెప్పుడొ జేరెడి భాగ్యం
బిప్పుడు జేరెను కొలదిగ వినుమా పుత్రా!
క.
యని యా ముని వివరించుచు
గనుమని ఫలితాల విలువ కథగాజెప్పన్
వినయముతో ముని మాటలు
వినుచుండెను బుద్ధి తోడ విలువలు నేర్వన్
ఉ.
నెప్పటి కర్మయోగమిది నెంతయొ దక్కెడి భాగ్యముండినన్
తప్పుల తోడ నీకు మరి తక్కువ నొందెడి భాగ్యమొచ్చెనే
నిప్పటికైన ధర్మతకు నెప్పుడు ముప్పులు జేయబోకుమా
తుప్పును దీసినట్లుగనె దూకుడు నాపుము జీవితంబునన్
ఉ.
దక్కిన లబ్ది తోడ కడు ధన్యుడ వైతివి సద్గుణంబుచే
చక్కర వంటి జీవితము చక్కటి మార్గము నెంచుమిప్పుడున్
తక్కువ గాని ద్రవ్యమిది తారల జేరెడి దాకవచ్చునే
నిక్కము జెప్పుచుంటినని నేర్పగ జ్ఞానము; వీడబోననెన్
ఉ.
అప్పటి నుండి ధర్మముగ నాటలు మానుచు బుద్ధి మంతుడై
తిప్పలు లేని జీవితము తీపిగ సాగగ నంతమెచ్చిరే
ముప్పది దుర్గుణంబులను ముక్కలు జేయగ నీశ్వరార్చనల్
మ్రొక్కుచు నీతిగన్ బ్రతుక మోదము నిండునె నమ్మినంతలో
తే.గీ
బుద్ధి కుశలతే సిద్దమై ముందు నిలచి
పుణ్య ఫలితాలనందిచు పుడమినందు
మేలి మైనట్టి పనులలో మిక్కిలిగను
దైవ సంపదల్ ధనకీర్తి తారసపడుఁ

కామెంట్‌లు