కాకి లెక్కలు ; -డా.ఎమ్.హరికిషన్-కర్నూలు-9441032212

 కాకి లెక్కలు అంటే ఉత్తుత్త లెక్కలు. అప్పటికప్పుడు ఏవేవో నోటికొచ్చినట్టు చెప్పడం. ఇవి ఖచ్చితమైనవి కావు. ఎటువంటి ఆధారాలు వుండవు కానీ ఈ కాకి లెక్కలనే చాలా ఖచ్చితమైనవి అన్నట్టుగా కొందరు తమ వాక్ చాతుర్యంతో మనల్ని భ్రమల్లో ముంచుతూ ఎటువంటి జంకు గొంకు లేకుండా ప్రకటించేస్తుంటారు. రాజకీయ నాయకులు ఇందులో దిట్ట. ప్రభుత్వ అధికారులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెప్పే మాటల్లో, చేసే ప్రకటనల్లో కూడా అన్నీ కాకి లెక్కలే ఉంటాయి. ఎవరూ తాము చెప్పిన వాటన్నిటీ ఆరా తీయరు, ఏమీ చేయలేరు అనే ధైర్యం దీనికి కారణం కావచ్చు. ఆ మాటలు నిజమో కాదో తెలుసుకోవాలని ఆసక్తి, ఒపిక ఎవరికీ వుండదు. 
ప్రభుత్వ కార్యాలయాల్లో చాలాసార్లు పైనుంచి సమాచారం హఠాత్తుగా అడుగుతూ వుంటారు.  కింది అధికారులు కూడా ఏమాత్రం తడుముకోకుండా అంతా ప్రగతి పథంలో దూసుకుపోతున్నట్లుగా కాకి లెక్కలు వేసి నివేదికలు అందిస్తారు. వాస్తవాలు చెబితే తిట్లు తప్పవు. నిజానికి అవి ఎవరికీ అవసరం లేదు కూడా. కింది నుంచి పై వరకు అంతా కాకి లెక్కలే ఇష్టపడతారు. ఇది బహిరంగ రహస్యమే. కాగితాలలో అద్భుతమైన ప్రగతి కనబడుతుంది. వాస్తవంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. మాటలు కోటలు దాటుతూ ఉంటాయి గానీ చేతలు గడప దాటవు.
ఇంతకీ ఈ జాతీయం ఎలా వచ్చిందంటే అక్బర్ బీర్బల్ కథలు మనకందరికీ తెలుసు కదా. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడు కథలు ఎంత ప్రశిద్ధో ఇవి కూడా అంతే ప్రసిద్ధి. అక్బర్ చక్రవర్తి దగ్గర వుండే బీర్బల్ చాలా తెలివైనవాడు. ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా టక్కున సమాధానం చెప్పగలడు. మంచి హాస్య చతురత గలవాడు. తన మాటలతో రాజును సభికులను నవ్వులలో ముంచత్త గలవాడు. అక్బర్ కు ఎంతో ప్రియమైన వాడు. 
ఒకసారి అక్బర్ చక్రవర్తి సరదాగా ఒక తోటలో తిరుగుతా వున్నాడు. ఎప్పటిలాగే పక్కన బీర్బల్ వున్నాడు. అంతలో ఆ తోటలోకి ఒక కాకుల గుంపు వచ్చింది. అవన్నీ కలసి కావు కావుమంటూ ఒకేసారి గట్టిగా అరవసాగాయి. అక్బర్ చూపు ఆ కాకుల మీద పడింది. పెదాల మీద చిరునవ్వు మెరిసింది. బీర్బల్ ను ఆటపట్టించాలి అనుకున్నాడు. వెంటనే బీర్బల్ వైపు తిరిగి "మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయో సరిగ్గా చెప్పగలవా? అలా చెబితే నా మెడలోని అత్యంత విలువైన ఈ రత్నాలహారాన్ని ఇప్పటికిప్పుడు నీకు ఒక కానుకగా ఇస్తా" అన్నాడు. 
చెట్ల మీద గుడు కట్టుకొని ఒకచోట వుండకుండా ఆకాశంలో ఎటుపడితే అటు తిరిగే కాకుల సంఖ్య అప్పటికప్పుడు చెప్పడం ఎంతో కష్టం కదా... కానీ బీర్బల్ ఏమాత్రం తడుముకోకుండా ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆకాశంలోకి చూస్తూ, చేతివేళ్లతో గాలిలోనే లెక్కలు వేసి "మహారాజా ప్రస్తుతం మన రాజ్యంలో అరవై ఆరు వేలా నాలుగు వందలా నలభి రెండు కాకులు వున్నాయి" అన్నాడు కొంచెం కూడా తడుముకోకుండా. ఆ మాటలకు అక్బర్ ఆశ్చర్యంగా "అంత ఖచ్చితంగా ఎలా చెబుతావు" అన్నాడు.
"మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే సైనికులను పంపించి రాజ్యమంతా లెక్కించండి ప్రభూ. తప్పయితే శిక్షించండి" అన్నాడు బీర్బల్. 
"సరే... అయితే నీవు చెప్పిన వాటికంటే ఎక్కువ వుండవు అంటావు" అన్నాడు అక్బర్. 
"మహారాజా... మన రాజ్యం మీ పాలనలో మంచి పంటలతో కలకలలాడిపోతూ వుందిది కదా అందుకని చుట్టుపక్కల రాజ్యాలలోని కాకులు ఆహారం కోసం మన రాజ్యంలోకి వచ్చి వుండవచ్చు. అలాంటి సమయంలో కొన్నిసార్లు నేను చెప్పిన దానికన్నా ఎక్కువగా కనబడవచ్చు" అన్నాడు. 
"మరి తక్కువ కనబడవా" ప్రశ్నించాడు అక్బర్. 
బీర్బల్ చిరునవ్వుతో "మహారాజా... మూడుపూటల హాయిగా కడుపునిండా తిని కులాసాగా మన రాజ్యంలో తిరిగే కాకులు అప్పుడప్పుడు చుట్టుపక్కల రాజ్యాలలో వున్నటువంటి వాటి బంధువులను స్నేహితులను పలకరించడానికి పోతూ వుంటాయి కదా... ఆ సమయంలో తక్కువ కూడా కనపడవచ్చు" అన్నాడు. 
అక్బర్ తల గోక్కుంటూ "మరి ఖచ్చితంగా కాకుల సంఖ్య ఎలా లెక్కబెట్టాలి" అన్నాడు అక్బర్. 
"చాలా సులభం మహారాజా... రాజ్యం చుట్టుపక్కల సరిహద్దులన్నీ మూసివేయండి. అటువైపు కాకి ఇటువైపు కానీ ఇటువైపు కాకి అటువైపు గానీ ఎగరకుండా కట్టడి చేయండి. అలాగే మన రాజ్యానికి వచ్చిన ఇతర రాజ్యాల కాకులను బంధించి వెంటనే వాటి వాటి రాజ్యాలకు పంపించి వేయండి. అలాగే ఇతర రాజ్యాలకు పోయిన వాటిని వెనక్కి రప్పించండి. అప్పుడు లెక్క పెట్టండి. నేను చెప్పిన వాటిలో ఒకటి తక్కువ వచ్చినా మీరు నన్ను శిక్షించవచ్చు" అన్నాడు చిరునవ్వుతో. 
"ఇదంతా అయ్యే పని కాదు" అని రాజుకు తెలుసు. దాంతో పకపకపక నవ్వుతూ "బీర్బల్... నీ సమాధానం చాలా సరదాగా, మనసుకు హాయిగా, వినసొంపుగా, నువ్వు చెబుతున్నదంతా నిజమేనేమో అనేటట్లుగా, అద్భుతంగా, అర్థవంతంగా వుంది. అందుకో ఈ రత్నాలహారం" అంటూ కానుకను అందించాడు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన అక్బర్ బీర్బల్ కాకి లెక్కల కథ. ఈ కథనుండే కాకి లెక్కలు అనే జాతీయం పుట్టి వుండవచ్చు అని అనేకుల అభిప్రాయం.
కామెంట్‌లు