వెంపటి రాధాకృష్ణమూర్తి గారు రంగస్థల వేదిక పైన రారాజు ఆ రోజుల్లో ఆయనను మించిన నటులు లేరు అని చెప్పవచ్చు పౌరాణిక సాంఘిక నాటకాలు అనేకం ప్రదర్శించారు. సాంఘిక నాటకం లో చెప్పుకోదగినది పునర్జన్మ దానిలో ప్రతి నాయకుని పాత్ర కథానాయకుడిని కథానాయికను కూడా మించి నటించిన నటుడు తరువాత ఆకాశవాణిలో చేరి విజయవాడ కేంద్రంలో కూడా పనిచేశారు. కొంతకాలం హైదరాబాద్ కేంద్రంలో కూడా ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేసేంతవరకు విజయవాడ కేంద్రంలోనే ఉన్నారు. ఆయనదొక ప్రత్యేక బాణి పౌరాణిక నాటకాలు సాంఘిక నాటకాలు ప్రదర్శించిన దానిలో ఔచిత్యం చెడకుండా సహజ నటనకు ప్రాధాన్యత నిచ్చి చక్కటి దర్శకత్వ ప్రతిభతో విలసిల్లిన వాడు మా వెంపటి. వారితో కొన్ని నాటకాలు నేను చేయడం నా అదృష్టం.
నాటకం విషయంలో ఎంత పెద్ద వారు తప్పు చేసినా దానిని ధైర్యంగా అలా కాదు ఇలా చేయండి అని చెప్పగలిగిన వ్యక్తి రంగస్థలానికి సంబంధించినంత వరకు ఎవరికీ తలవంచలేదు నా నాటకాలు నా పాత్రల పోషణ వారికి చాలా బాగా నచ్చి నన్ను అభినందించేవారు నీలాంటి సున్నితమైన గొంతు దొరకడం ఆకాశవాణి అదృష్టం అని అనేకసార్లు అభినందించారు. వ్యక్తిగతంగా మా అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉండి అన్ని విషయాలలోనూ కలివిడిగా మెలిగేవాడు భౌతికంగా వారు లేని లోపం మాకు ప్రత్యక్షంగా తెలుస్తోంది. వంటింటికి కుంపటి రంగస్థల నాటకానికి వెంపటి ఉండాలి అంటాడు మా వెంపటి రాధాకృష్ణ. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి తో పౌరాణిక నాటకాలను అమ్మ వారి నాటకాలను వ్రాయించి అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఒక సందర్భంలో పౌరాణిక నాటకంలో నేను నాయకుడు, ఆయన ప్రతి నాయకుడు దానిని సి.రామ్ మోహన్ రావు నిర్వహించారు మధ్యలో ఒక వాక్యం అలా కాదు ఇలా చెప్పు అన్నాడు వాడు చెప్పినట్లు మాత్రం చెప్పకు నువ్వు చాలా చక్కగా చెప్పావు. వీడు కె.వెంకటేశ్వరరావు నండూరి విఠల్ వీళ్లకు ఒక జబ్బువాళ్లు చెప్పినట్లే అందరూ చెప్పాలి. దాంతో రాజు గారి నుంచి సేవకుడు దాకా అందరూ ఒకే బాణీ. వినే వాడికి విసుగెత్తి పోతుంది వాడిలో నువ్వు తీసుకోవలసినది భావం ఒకటే భావం చెడకుండా నీ ఇష్టం వచ్చిన బాణీలో చెప్పు వాడి బాణీకి మాత్రం వెళ్ళవద్దు అని చెప్పడం ఆకాశవాణిలో నా నాటక జీవితానికి ఒక కొత్త ఒరవడి తీర్చిదిద్దబడింది. అందుకు జీవితాంతం ఆయనకి కృతజ్ఞుడిని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి