ఆపద్ధర్మం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 పైడిపాల వారు మంచి రచయిత, విమర్శకుడు.
జగ్గయ్య గారి సహకారంతో  ఆచార్య ఆత్రేయ సాహిత్యం మొత్తాన్ని వెలికి తీసిన వాడు  పైడిపాల.ఆయన భార్య కుసుమ  ఎక్కువ సత్తా లేకపోయినా చిన్న చిన్న నాటకాలు రాస్తూ ఉంటుంది. ఓ పర్యాయం విశాఖపట్నం వచ్చి తను రాసిన నాటకం ప్రసారమై చాలా కాలమైంది  ఏమిటి కారణం అని అడిగింది.  త్వరలోనే  చేస్తాను అని చెప్పాను  తన ప్రక్క తన స్నేహితురాలు భవానిని తీసుకొచ్చింది అమలాపురం నుంచి. ఆవిడ సాధారణ గృహిణి  ఆవిడని నాలుగు ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పించి దాన్ని రేడియోలో ప్రసారం చేస్తే ఎంత ఆనందించిందో చెప్పడానికి వీలు లేదు. ఆ రాత్రి మా ఇంట్లోనే ఇద్దరు ఉండి  తెల్లవారి కాకినాడలో ఓబికి వెళుతూ వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళాను. భవానిది మంచి గొంతు చెప్పింది చెప్పినట్లుగా చేస్తుంది. దాంతో ఆమెతో కాకినాడ కార్యక్రమంలో  కార్యక్రమాలన్నీటికి అనౌన్స్మెంట్స్ ఇప్పించాను.
ఆ సాయంత్రం కదంబ కార్యక్రమం ఆకెళ్ళ రామకృష్ణ గారి బృందం రెడ్డి, సాయి, మూర్తి వాళ్ళతో నాటకం  దాంట్లో స్త్రీ పాత్ర కోసం వెతుక్కుంటూ ఉంటే భవానిని పిలిచి ఆ వేషం చదివించాను.  అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు ఆమె ఎంతో ఆనందించింది. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతుంటాయి అనేక మంది కొత్త వారిని పరిచయం చేసిన వాడిని నేనే. ఆకెళ్ళ రామకృష్ణ గారు కాకినాడలో  తపాలా శాఖలో ఇంజనీరుగా పనిచేస్తున్నారు  సినిమాలలో మాటలు రాస్తున్న  ఆకెళ్ల వీరికి తమ్ముడు  సినిమాలలో కూడా తమ్ముడికి సహకరిస్తూ చాలా దృశ్యాలను వ్రాశాడు. తాను రాసిన నాటకాన్ని  రికార్డు చేస్తూ ఉంటే  అంతా వచ్చి కూర్చున్నారు  అయితే దానిలో  స్త్రీ పాత్ర ధారిణి రాకపోవడంతో అందరూ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు  మధ్యలో కబురు వచ్చింది ఆమె వేరే రంగస్థలం నాటకం వుండి ఇక్కడికి రాలేదు  ప్రస్తుతం రాదు అని రామకృష్ణ గారికి సమాచారం. వారికి ఏమి తోచలేదు ఆనంద్ గారు ఆ పాత్ర నేను పురుష పాత్రగా మార్చమంటారా  అని అడిగితే  దానికి చాలా సమయం పడుతుంది  మీరేం భయపడకండి అన్ని నేను చూసుకుంటాను అని చెప్పి నా ప్రక్కన ఉన్న ఆవిడతో ఆ పాత్ర చదివించాను. ఆ రంగస్థలనటి కన్నా చాలా బాగా చేసింది అని రామకృష్ణ గారు మమ్మల్ని అభినందించారు. ఆ పూట గట్టెక్కించినందుకు నాకు కృతజ్ఞతలు చెప్పారు

కామెంట్‌లు