తెలుగుజాతికి మేలు చేసిన నలుగురు బ్రిటిషు వారిలో బ్రౌన్ కూడా ఒకరు. సర్ ఆర్థర్ కాటన్, కాలిన్‌మెకంజి, థామస్ మన్రోలతో పాటు గౌరవించబడ్డవారు. తెలుగు భాషోద్ధారకుడు గొప్పపేరు సంపాదించుకున్న వారు. అంతేగాక, పలు సందర్భాలలో మానవీయ విలువల్ని పరిరక్షించే చర్యలు చేపట్టారు. బ్రిటిషువాడై ఉండి, ఒక ఉన్నతాధికారి గా ఉండి, ఇక్కడి మనుషుల మనసులు అర్థంచేసుకోగలగడం నిజంగా హర్షించదగ్గ విషయం. తన జీవిత ధ్యేయం సాధించుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్కచేయక, మానవ జాతి అంతా ఒకటే అన్న భావనతో ప్రగతి పథంలోకి దూసుకుపోయారు. స్వార్థ, సంకుచిత మనస్తత్వమే గనక ఆయనకు ఉండి ఉంటే, చార్లెస్ బ్రౌన్ ఈ రోజు తెలుగువారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకునే వారే కాదు.
సి.పి.బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి డేవిడ్ బ్రౌన్ ఒక క్రైస్తవ పండితుడు. ఒక అనాథశ్రమానికి మేనేజర్‌గా పనిచేసేవారు. ఆయనకు సంస్కృత భాషమీద మంచి పట్టు ఉండేది. తండ్రి మరణం తర్వాత బ్రౌన్ కుటుంబం ఇంగ్లాండు వెళ్ళిపోవాల్సి వచ్చింది. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న యువకుడైన సి.పి. బ్రౌన్, గ్రీక్, లాటిన్, ఫారసీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం గడించారు. అక్కడే హిందుస్థానీ భాష నేర్చుకున్నారు. తర్వాత 4 ఆగస్టు 1817న ఇండియా వచ్చి, ఇక్కడి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరారు. మద్రాసులో వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగులో కొంత ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించుకున్నారు. వేమన, సుమతి శతకాలతో పాటు పలనాటి యుద్ధం లాంటి చారిత్రక కావ్యాలను, అలాగే నన్నయ్య, తిక్కన, గౌరవ, పోతన, పెద్దన శ్రీనాథుడు, రామరాజ భూషణుల కృతులను పరిష్కరించి ప్రచురించారు.
ఇంగ్లీషువాడైనా తెలుగు సాహిత్యం కోసం తన జీవితం త్యాగం చేశాడు బ్రౌన్. మాతృభాష మాతృభాషే. దాని విలువ దానిదే అన్న విషయాన్ని యావత్ ప్రపంచం అంతా ఎలుగెత్తి చాటి చెప్పిన మహనీయుడు సి పి బ్రౌన్. 1832-33 ప్రాంతంలో గుంటూరు కరువు / నందన కరువు / డొక్కల కరువు వచ్చింది. ఆ సమయంలో బ్రౌను ఒక మానవవాదిగా చేసిన సేవలు - అప్పుడు ప్రశంసలు అందుకున్నాయి, చరిత్రలో నిలిచిపోయాయి. అప్పటి ఆ కరువును కరువుగా కాక, కొరతగా రాయాలని పై అధికారులు సూచించారు. అయినా, ఆయన వారి అభీష్టానికి వ్యతిరేకంగా వాస్తవాన్ని వాస్తవంగానే నమోదు చేశారు. ఫలితంగా అధికారుల అసంతృప్తికి, అసహనానికి గురయ్యారు. 1834లో ఉద్యోగం నుంచి తొలగింపబడ్డారు. ఫలితంగా ఇంగ్లాండు వెళ్ళిపోయారు.
తెలుగు భాషోద్ధారకుడు సి పి బ్రౌన్ ;- సి.హెచ్.ప్రతాప్ ( చరవాణి: 95508 51075 )
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి