పలుకులే దివ్యౌషధం సి.హెచ్.ప్రతాప్ ( చరవాణి: 95508 51075 )
 దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మసంస్థాపన ల కోసం పంంధొమిదో శతాబ్దం లో ఈ భువిపై వెలసిన సమర్ధ సద్గురువు శ్రీ సాయినాధులు. తనను మనస్పూర్తిగా విశ్వసించిన తన భక్తులకు ఎల్లవేళలా వెన్నంటి వుండి వారికి తన అమూల్యమైన, అభేఢ్యమైన రక్షణ కవచం అందించడమే కాక, తన బోధలతో, ఉపదేశములతో వారిలో పరివర్తన గావించి , సన్మార్గంలో నడిపించే అద్భుతమైన దైవం శ్రీ సాయి. శ్రీ సాయిని నమ్మిన లక్షలాది మంది ఈనాటికీ సుఖ సంతోషాలతో, అయు: ఆరోగ్యాలతో జీవిస్తున్నారు. శ్రీ సాయి తన భక్తులను రక్షించి, వారి సమస్యలను, చింతలను, దూరం చేసే పద్ధతి చాలా విచిత్రమైనది. ఆది ఏ సాంప్రదాయాలకు, మతాలకు చెందనిది.అటువంటి ఒక విచిత్రమైన లీలను ఇప్పుడు స్మరించుకుందాము.
శ్రీ సాయికి అత్యంత సన్నిహిత , ముఖ్యమైన భక్తుడైన బాపూసాహెబ్ బూటీ ఒకసారి జిగట ఇరోచనముల వలన తీవ్రంగా బాధపడ్డాడు. స్వతాహాగా ధనవంతుడవడం వలన ఎందరో ప్రసిద్ధులైన డాక్టర్లకు చూపించుకొని వారిచ్చిన మందులను వాడాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. కొద్ది రోజులలోనే బూటీ బాగా నీరసించిపోయాడు. కదల లేకపోవడం వలన శ్రీ సాయి దర్శనానికై మశీదుకు పోలేకపోయాడు. అప్పుడు బాబా అతనిని మశీదుకు రమ్మని కబురు పంపించి, బూటీ రాగానే తన ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వేలు ఆడించుచూ “ తస్మాత్ జాగ్రత్త ! నీవిక విరేచనములను చేయకూడదు “ అని దృఢంగా పలికారు. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధి రాజు అయిన బాబా ఆ మాటలను అనగానే వెంటనే విరేచనాలు ఆగిపోయాయి. గొప్ప గొప్ప దాక్టర్లు, విలువైన మందులు కుదర్చలేని జబ్బును ఆ మహానుభావుడు కేవలం తన మాటలతో కుదిర్చిన వైనం అత్యంత విశిష్టమైనది.
మరొక సంధర్బంలో బూటీకి కలరా వ్యాధి సోకింది.ఒక రోజులోనే తీవ్రంగా నీరసించిపోయాడు. ఏ విధమైన ఆహారాన్ని, కనీసం నీరును కుడా తాగలేకపోయాడు.బూటీకి సన్నిహితుడైన డాక్టర్ పిళ్ళై తన వద్ద వున్న ఔషఢములనింటినీ ప్రయత్నించాడు కానీ అవి కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా ఇవ్వలేకపోయాయి. అప్పుడు బూటీ మసీదుకు వెళ్ళి బాబా కాళ్ళపై పడి తన వ్యాధిని తగ్గించమని ప్రాధేయపడ్దాడు. అప్పుడు శ్రీ సాయి బాదం పప్పు, పిస్తా,అక్రోటులను బాగా నానబెట్టి, పాలు, చక్కెరలో ఉడికించి సేవించమని చెప్పారు.ఆ మాటలను విన్న వారందరూ ఎంతగానో ఆశ్చర్య పోయారు.ఎందుకంటే వైద్య శాస్త్రం ప్రకారం ఈ మిశ్రమాన్ని సేవిస్తే జబ్బు మరింత తీవ్రమై చివరకు ప్రాణాలకే ముప్పు కలుగవచ్చును. కానీ బూటీ బాబా ఆజ్ఞను శిరసావహించి ఆ మిశ్రమాన్ని సేవించాడు. చిత్రాతి చిత్రంగా బూటీ యొక్క కలరా వ్యాధి కొద్ది గంటలలోనే తగ్గిపోయి అతనికి పూర్తి స్వస్థత చేకూరింది.
ఈ విధంగా వైద్య విజ్ఞాన శాస్త్రాలన్నింటికీ విరుద్ధంగా బాబా తనదైన ప్రత్యేక శైలిలో తన భక్తుల రోగాలను తగ్గించివేసారు. ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే బాబా మాటలే ఈ ప్రకృతి అంతటికీ శిరోధార్యం.బాబా పలుకులే వేద, విజ్ఞాన శాస్త్రాలు.సంప్రదాయాలు, ఆచార వ్యవహారములు, మంత్ర శక్తులు ,వైద్య విధానములు అన్నీ బాబా యొక్క అపూర్వమైన యోగ శక్తి ముందు దిగదుడుపే !బాబా ఆజ్ఞలను శిరసా వహించువారికి ఆయన యొక్క అనుగ్రహ , కరుణా కటాక్షములు లభ్యమై జీవితం ఆనందంగా, సాఫిగా సాగిపోతుంది.

కామెంట్‌లు