మాటే మంత్రం;--సి.హెచ్.ప్రతాప్-సెల్ ; : 95508 51075
 మానవులకు అందానిచ్చేది వాక్కు. మాటలలో మృదుత్వం,నిజాయితీ చిత్తశుద్ధి తప్పక వుండాలి. వాగ్భూషణం భాషణం. కాలు జారిన తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోవడం అసాధ్యం. సంబంధ బాంధవ్యాలు విచ్చిన్నం అవుతాయి. మాటలు శృతి మించితే  యుద్ధం మొదలౌతుంది.  జీవితాలే నాశనం కాగలవు. మాటలు మమతలను పంచుతూ స్నేహ వారధులను నిర్మించేవిగా వుండాలి. మనసులను కరిగించాలి, జీవితాలలో వెన్నెల వెలుగులను నింపాలి. అద్భుత విజయాలను, అజరామరమైన కీర్తి పతిష్టలను అందించేది మంచి మాట మాత్రమే. అందుకే ,మాటే మంత్రము, మనసే బంధం అన్నాడొక కవి. మాట రెండువైపులా పదును వున్న కత్తి లాంటిది. ప్రాణాన్ని నిలపగలదు, ప్రాణాన్ని తీయగలదు కూడా. రెండు మనసులను కలపగలిగే,నిండు ప్రాణాలను నిలపగలిగే మంచి మాట స్వంతం చేసుకోవాలి.వినసొంపైన మాటే నిజమైన ఆభరణం. సహజంగా మనం ఎదుటివారితో సంభాషించేటప్పుడు మన మాట ద్వారా వ్యక్తమైన భావాలు ఎదుటివారిలో ఆనందాన్ని కాని, ఆవేదనను కానీ, జుగుప్సను కానీ, భయాన్ని కానీ,సందేహాన్ని కానీ కలిగిస్తాయి. కాని వాస్తవంగా పరిశీలిస్తే మనం పలికే మాట ఎదుటివారికి సత్యాన్ని, హితాన్ని, ప్రియాన్ని, ఆచరణను కలిగించేదే. ఆ మాటలలోని మాధుర్యాన్ని గ్రహించి అనుభవించిన వారు సన్మార్గాన్ని పొంది, సమాజంలో గౌరవింపబడతారు. ఒక మహాకవి "మానవునికి నిజమైన ఆభరణం మాటే" అని ఒక అందమైన శ్లోకం ద్వారా తెలియజేసాడు. బాగా పండిన ఫలములతో కూడిన వృక్షము ఎంతో వినయంతో క్రిందికి వంగి తన విధేయతను ప్రదర్శిస్తుంది" అలాగే వినయంగా ఉండటం, వినయంగా మాట్లాడటం అదే మానవునికి నిజమైన అభరణం. ఎవ్వరినీ నిందించకుండా మాట్లాడటం, అవసరమైనంతవరకు మాట్లాడటం, ఇవన్నీ మనం నేర్చుకోతగినవి, సత్యాన్ని పలకటంవలన ధర్మరాజు, హరిశ్చంద్రుడు మొదలైన వారు తాత్కాలికంగా కష్టాలు అనుభవించినా, శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు. 
సి హెచ్ ప్రతాప్ 


ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
 

కామెంట్‌లు