మానవతా ధర్మం; --: సి.హెచ్.ప్రతాప్ ( చరవాణి: 95508 51075 )
 రాఘవపురంలో  ప్రాథమిక పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న సోము  తరగతి గదిలోకి ప్రవేశించడానికి ఉపాధ్యాయుడు అనుమతి కోరాడు. అప్పటికే ఒక అరగంట ఆలస్యం అయ్యింది. క్లాసుకు లేటయ్యాని, ఎక్కడ ఉపాధ్యాయుడు అనుమతి ఇవ్వడో అని సోము భయంతో వణికిపోతున్నాడు. “ఈ రోజు నుంచి పరీక్షలు మొదలవు తున్నాయి అని తెలిసి కూడా అరగంట ఆలస్యంగా ఎందుకు వచ్చావు ? చదువంటే అంత వెటకారంగా ఉందా ?" స్కేలు ఝుళుపిస్తూ కోపంగా అరిచాడు ఉపాధ్యాయుడు..
“రోజూ బయలుదేరే టైముకే బయలుదేరాను. అయితే దారిలో ఒక ముసలమ్మ కడుపునొప్పితో గింగుర్లు తిరిగిపోతూ వుంది. రోడ్డున పోయే వారు ఆమెను చూస్తూ నవ్వుకుంటూ మనకెందుకని వెళిపోతున్నారు. అప్పుడు నాకు మా అమ్మమ్మ చెప్పిన విషయం ఒకటి గుర్తొచ్చింది. ఎవరైనా ఆపదలో వున్నా లేక కష్టకాలం లో వున్నా సాటి మానవునిగా వారిని మనకు చేతనైనంత ఆదుకోవడం మన కనీస ధర్మం. అందుకని ఇతరుల గురించి కొంత మన సమయం పక్కన పెట్టడం మన కనీస కర్తవ్యం అని తను తరచుగా చెబుతుండేది. నేను నా వాటర్ బాటిల్ నుండి ఆమె చేత నీళ్లు తాగించాను. నా దగ్గర వున్న డబ్బులతో  బన్ను , టీ కొని తాగించాను. పక్కనే వున్న మందుల షాపు నుండి కడుపు నొప్పికి మాత్రలు కొని వేయించాను. కొంతసేపటికి ఆవిడ కాస్త తెప్పరిల్లింది. అప్పుడు నేను బయలుదేరి వచ్చాను. అందుకే ఆలస్యం అయ్యింది మాస్టారు" చెప్పాడు సోము.  
'అలాగా! సాటి మానవుల పట్ల ఎంత చక్కని దయ కనబరిచి నీ సేవాస్పూర్తిని చాటుకున్నావు. మీ అమ్మమ్మ గారు చెప్పిన ముఖ్యమైన విషయాలను కేవలం విని ఊరుకోకుండా వాటిని అమలు చేసి సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచావు. నీ వంటి బాలల వలన ఈ దేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలుస్తుంది. సోము  చేసిన మంచి పనికి అందరూ చప్పట్లు కొట్టండి' అన్నారు ఉపాధ్యాయుడు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ప్రధానోపాధ్యాయుడి ప్రత్యేక  అనుమతి తీసుకుని సోము  పరీక్ష రాసే అవకాశం కల్పించారు ఉపాధ్యాయుడు.

కామెంట్‌లు