*వృద్ధాప్యం ( మమతా పారిజాతాలు )-ఎం. వి. ఉమాదేవి --బాసర.
గాజుకళ్లలో వెలిగే  గతజ్ఞాపకాలు
ముడుచుకొని ఉన్నపెదాలవెనక మూట కట్టిన 
ముచ్చట్లు ఎన్నో... 
దగ్గరికి రండిరా నాన్నా 
అంటూ పిలిచే చూపులు 
స్పర్శ కోసమే తహతహలాడే చేతులు 
వెరసి వృద్ధాప్యం వరమా, శాపమా? 
బేతాళ ప్రశ్నలు బేజారు!!

తిప్పితిప్పి తినిపించిన 
పప్పు బువ్వ గుర్తుచేస్కో 
ప్రత్యేకంగా మృదువైన ఆహారం 
వాళ్ళకివ్వండి !!

పండుగల్లో కుట్టించినకొత్తబట్టలు ఎంత ముచ్చట వాళ్ళ కి..? 
శక్తి కొద్దీ శుభ్రమైన పరిసరాలలో 
వాళ్ళని ఉంచుకో !!
చిన్న చిన్న పలకరింపులు ఎంత శక్తి కాళ్ళకీ !

కాసేపు కూర్చొని 
కష్టం సుఖం మాట్లాడు 
కావాల్సిన సలహాలు పొందు 
అనుభవం అందించే సూచనలు గొప్పవి !!

పిల్లలు మననుండి నేర్చుకున్నవే 
మనకి అనుభవాలు అవుతాయి !
ఎన్ని సమస్యలున్నా.. 
తల్లిదండ్రులని బాగా చూసేవారు ధన్యులు!
వారు దేవునికి ప్రియమైనమిత్రులు!!
మనం మనవళ్ల నెత్తుకున్నా... 
అమ్మ నాన్నల దగ్గర చిన్న పిల్లలమే !!
ముడతపడిన ముఖంలో 
నిర్వేదం రానీయకండి!!
వాళ్ళనలా సంతోషంగా 
నిష్క్రమించగలవారిని చేద్దాం !!

కామెంట్‌లు