సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 తరిషము...తరీషము
  *****
 మనసొక తరిషము. అంతులేని ఆలోచనల కల్లోల కడలి.ఊహ తెలిసినప్పటి నుండి ఊపిరి ఆగి పోయేంత వరకు ఆగని కోరికల తారిషము.
క్షీర సాగర మధనంలో అమృతం దొరికినట్టే మనోసాగరాన్ని మధిస్తేనే కొత్త ప్రపంచం ఆవిష్కరింపబడుతుంది.
ఇంతకూ తరిషము అంటే ఏమిటో చూద్దాం...
 సముద్రము,జలధరం,తరీయము,తోయనిధి,పయోధి,పయోనిధి,సాగరము,శరధి,సింధువు,తారిషము,తావిషము,తర్షము లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
సింధువులో బిందువైన మనం తరిషములో తరీషముగా గుప్పెడంత గుండె సారధ్యంలో ప్రయాణం  సాగిస్తూ ఉంటాం.
తరిషము..తరీషము మధ్య ఓ చిన్న గుణింత భేదంతోనే అర్థం కూడా మారడం భలేగా అనిపిస్తుంది.
తరిషము అంటే సముద్రం కదా! మరి తరీషము అంటే ఏమిటో చూద్దాం...ఓడ,నావ,తరణి,తరిణి, నౌక,తరణము,వారి రథము,యాన పాత్రము,వహిత్రము లాంటి అర్థాలు ఉన్నాయి.
ఓ గేయ రచయిత "నా బతుకొక నావ...దానిని నడిపే సారథి నీవా" అంటాడు భక్తితో.
ఈ కాల తరిషములో పయనించే మన బతుకు తరీషమునకు ఎన్నో ఒడిదుడుకులు,బాధల ఆటుపోట్లు తప్పవు.
వాటన్నింటినీ అధిగమించి మనో  తీరం చేరాలంటే కావాల్సింది మనలో తగినంత ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు