*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - ప్రారంభం*
 *ఈ రోజు, తెలుగు నెలలో ఉత్తమమైన "మార్గశీర్ష మాసము" లేదా "మార్గశిర" మాసం మొదటి రోజు. ఈ మాసం అంటే తానే అని కృష్ణ పరమాత్మ భగవద్గీత దశమాధ్యాయంలో స్వయంగా చెప్పారు. అలాంటి ఉత్తమమైన మాసం మొదలు అవుతున్న ఈ రోజు చాలా అద్భుతమైన, అత్యుత్తమమైన రోజు. ఇటువంటి, రోజు మనం ఒక కొత్త శతకాన్ని చదువుకోవడం ప్రారంభిద్దాము. శ్రీకృష్ణ పరబ్రహ్హమణే నమః*
*ఈ నాటి మన చుట్టూ ఉన్న సమాజంలో, ఎంతసేపూ, ఆడపిల్ల ఇంటి గడప దాటిన క్షణక్షణం నుండి ఎలా మసలుకోవాలి అనే మాట్లాడు తాము. అమ్మా నువ్వు, ఇలాగే వుండు. అలా ఉండకూడదు, అని మన ఇంట్లో, ఇంకా అవకాశం వస్తే బయటి ఇళ్ళలో ఆడపిల్లలకు కూడా చెప్పడానికి వెనుకాడము. మనం ప్రతీ నిత్యము వింటున్న, స్త్రీల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు కారణం ఎవరు. కేవలం, స్త్రీలు వేసుకునే బట్టలు, ప్రవర్తన మాత్రమే దీనికి కారణమా. ఇప్పటి పరిస్థితులు చూస్తూ ఉన్న తల్లులు, తమ మగబిడ్డలకు "బాబూ! నీ ఇంట్లో ఉన్న నీ తల్లి, తోబుట్టువులు, పిన్నులు, పెద్దమ్మలు, అత్తలు అందరూ స్త్రీలేరా. వారిని నీవు గౌరవం తోనే చూస్తావు,కదా. అదే గౌరవ భావంతో నీ ఇంటి బయట ఉన్న స్త్రీలను కూడా చూడాలి. అప్పుడు, నీ గౌరవం పెరుగుతుంది. నీవల్ల ఇంటి గౌరవం పెరుగుతుంది" అని ఎంత మంది తల్లులు చెపుతున్నారు. చెపితే ఎంత మంది తండ్రులు, ఆ తల్లులను ప్రోత్సహిస్తున్నారు. విన్న మగమహారాజులు ఎంత మంది పాటిస్తున్నారు.*
*ఈ, స్త్రీలను అగౌరవ దృష్టి తో చూడటం అనేది, ఇవాళ కాదు, 1800, 1900 శతాబ్దాల కాలంలో కూడా ఉంది. ఇంకా ఎక్కువగా ఉందేమో కూడా. అందుకే అప్పుడు పరిస్థితులకు ప్రతిస్పందనగా, దర్పణం పట్టేడట్టుగా 1900 శతాబ్ద ప్రారంభంలో "పక్కి లక్ష్మీ నరసింహ కవి" "కుమార శతక" పద్యాలను రచించారు.*
*లక్ష్మీ నరసింహ కవి గారికి, అప్పలనరసయ్య అనే ఉపమానం కూడా ఉంది. రౌద్రినామ సంవత్సరం, పుష్యమాసంలో 1860 ప్రాంతంలో రాయబడింది. ఈ కవి గారి అభిప్రాయం ప్రకారం "బిడ్డలు చెడు ప్రవర్తనలో ఉండడానికి కారణం, తల్లిదండ్రుల పెంపకంలో లోపమే." తన శతక పద్యాలతో కవి, తల్లిదండ్రులు బిడ్డల పెంపకంలో తమ బాధ్యతను తెలుసుకునేటట్టు చేసారు. శతక రచన చాలా సామాన్య పద్ధతిలో ఉంది. పెద్ద పెద్ద పదబంధాలు మనకు కనబడవు.*
*మగ పిల్లలకు చెప్పవలసిన నీతి విషయాలను చాలా తేలిక భాషలో చెప్పారు. కొన్ని కొన్ని మార్పులతో కవి చెప్పిన చాలా విషయాలు ఈ రోజుకు కూడా వర్తిస్తాయి అనేది, కాదనలేని సత్యం.  సామాన్యులకు కూడా అర్ధమయ్యే భాషలో ఉన్నందువల్ల ఈ "కుమార శతకం" 1900 శతాబ్దంలో విస్తృత ప్రచారంలో ఉంది. అప్పుడు ఉన్న చాలామంది తెలుగు వారి నోటిలో ఈ పద్యాలు వినిపించేవి, అని ప్రచారం.*
*పరమేశ్వర కృప, ఈశ్వర అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని, ఉంటుంది అని ఆశిస్తూ, ఉండేలా దీవించమని అలన్మేలమంగా పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామిని వేడుకుంటూ.... ఈ "పక్కి లక్ష్మీ నరసింహ కవి - కుమార శతకం" పద్యాలను మనమందరం కలసి చదువుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు