:"నిత్యాగ్నిహోత్రం ";-నలిగల రాధికా రత్న.
మాట వినని టమాటా, 
ఘాటు తగ్గని మిర్చి 
దొరకని దొండ,బెదిరిస్తున్న బెండ...!!

చిక్కని చిక్కుడు,
బాధ పెడుతున్న బంగాళదుంప ,
ఉరిమి చూస్తున్న ఉల్లిపాయి 
వెక్కిరిస్తున్న వెల్లుల్లి....!!

పారిపోతున్న పాలకూర ,
తోక జాడిస్తున్న తోటకూర,
మిడిసి పడుతున్న మెంతికూర 
కొరకొరా చూస్తున్న కొత్తిమీర...!!

గమ్మత్తుగా మత్తు పెంచే 
గారడీల ప్యాకేజీలతో...
ఇంటి ఖర్చు ఇంతింతై
ధరల పిడుగు మోతతో....
సామాన్యునికి సాంబారే
పరమాన్నం గా మారే నేడు...!!

మిన్నంటిన ధరల నేపథ్యంలో....
లంచాలు మరిగిన 
ఉద్యోగ జీవితాలు...
అభివృద్ధిమంత్రాన్ని 
జపిస్తూ  ప్రభుత్వాలు...!!

ఏళ్ళు గడుస్తున్నా 
మారని కన్నీటి వ్యధలు.... 
పాలకుల పాదముద్రల కింద వడలిన 
పేద ,మధ్యతరగతి బ్రతుకులు....!!

ధరలు ఎంత పెరిగినా!
వంటింట్లో కుంపటి 
"నిత్యాగ్నిహోత్రమే"..!!


కామెంట్‌లు