సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అమని...ఆమని
   *****
ఆమనిలాంటి  జీవితాన్ని గడపాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
ఆమనిలా జీవితం విరియాలంటే సరియైన అమనిలో పయనించాల్సి ఉంటుంది.
మరి అమని అనే పదానికి ఏమేమి అర్థాలు ఉన్నాయో చూద్దాం... దారి,గమము,బాట ,జాడ మార్గము, త్రోవ, తెన్ను, యాత్ర, దిక్కు, పథము రహదారి ,ఆయనము లాంటి అర్థాలు ఎన్నో ఉన్నాయి.
మన గమము సుగమము కావాలంటే మనం నడిచే త్రోవ బాగుండాలి. ఆ దారిని మనమే బాగు చేసుకోవాలి. ఆటంకాల ముళ్ళను ఏరిపారేస్తూ,మార్గమంతా ఆత్మ విశ్వాస మొక్కలను నాటుకోవాలి. అప్పుడే  ఆశల పూలు విరబూసిన ఆమని కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
మరి ఆమని పదానికి ఏమేమి అర్థాలున్నాయో చూద్దాం... ఆమని అంటే వసంత ఋతువు, ఇష్మము, పికానందము, మధువుతో పాటు సమృద్ధి, ఒదుగు, పుష్కలము, సంపుష్టి, ఉపచితము, మస్తు, భూమము లాంటి అర్థాలు కూడా ఉన్నాయి.
ఋతువులన్నింటిలో ఆమనికో ప్రత్యేకత ఉంది.ఋతువులలో రాణి ఆమని.ఈ ఆమనిలో ప్రకృతి అంతా కొత్త అందాలను సంతరించుకుంటుంది.
చూసే కళ్ళకి ఆనందమే కాకుండా మనోల్లాసాన్ని కలిగిస్తుంది.ఆకులు రాలిన చోటే కొత్త చివుర్లు వచ్చి శోభాయమానంగా కనిపిస్తుంది.రంగు రంగుల పూలతో కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం కవితాత్మక హృదయాలను దోచుకుని "అందమే ఆనందం -ఆనందమే జీవిత మకరందం "అని పాడుకునేలా చేస్తుంది.
ఆమని లాంటి జీవిత మకరందాన్ని సమృద్ధిగా ఆస్వాదించాలంటే అమని సజావుగా సాగాలి.
ఆనందకరమైన అమనిలో పయనిద్దాం.ఆమని లాంటి జీవితాన్ని గడుపుదాం
మధ్యాహ్న నమస్సులతో 🙏

కామెంట్‌లు