మేడం కామా !;-- యామిజాల జగదీశ్
 అది 1907 ఆగస్ట్ 22. 
స్టట్ గర్ట్ (జర్మనీ).....
అంతర్జాతీయ సోషియలిజం మహానాడు జరుగుతున్న రోజు. ఆ సదస్సులో ఓ మహిళ ఆవేశపూరితంగా ప్రసంగిస్తున్నారు.
తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని ఆమె ఓ సువర్ణావకాశంగా భావించారు.
కారణం దేశభక్తి. 
అవును. ఆంగ్లేయుల పాలనలో భారత దేశం బానిసత్వంతో నలిగిపోతున్న రోజులవి. భారత ప్రజలు ఎంతలా అవస్థ పడుతున్నారనే వాస్తవాన్ని ఆమె తన  ప్రసంగంద్వారా ప్రపంచదేశాలకు తెలియజేయాలనుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వారు అక్కడ సమావేశమయ్యారు. తమతమ దేశాల తలరాతను మార్చగలమనే సదభిప్రాయంతో ఉన్న వారే.
ఇక కామా భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు పేదరికాన్ని అందరికీ చెప్పాలనుకున్నారు.
ప్రతి ఏడాది బ్రిటీష్ పాలకులు ముప్పై అయిదు మిలియన్ పౌండ్ల విలువైన వస్తువులను భారత దేశం నుంచి దోచుకుపోతున్నారని ఆరోపించారు.
ఆంగ్లేయుల దోపిడీతో భారత దేశ ఆర్థికస్థితి ఎంత దారుణంగా ఉంటోందనని ఆమె వివరంగా చెప్పారు. 
ప్రపంచ జనాభాలో అయిదులో ఒక వంతు భారతదేశంలో నివసిస్తున్నారు. స్వాతంత్ర్యం కోరుకునే వారందరూ భారత దేశ ప్రజానీకం బ్రిటీష్ ఏకాధిపత్యం నుంచి విముక్తి పాందడానికి చేతులు కలపాలని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.
అనంతరం ఆమె ఓ పని చేశారు.
అప్పటికప్పుడు ఆమె ఓ ఇండియా పతాకాన్ని పైకెత్తి చూపారు. 
ఇదే స్వతంత్ర భారత దేశ పతాకం.... స్వతంత్ర భారతం వచ్చేసిందని భావించండి.... భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారికిది పవిత్రచిహ్నం..... అందరూ ఇందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను అని ఆమె అన్నారు.
ఆమె ప్రసంగానికి ముగ్ధులైన వారందరూ లేచి నిల్చుని ఆ పతాకానికి నమస్కరిం చారు.
ఆమె 1905లో దేశభక్తి ఉన్న కొందరితో కలిసి రూపొందించిన పతాకమది. త్రివర్ణ పతాకం. 
తొలుత బెర్లిన్లోనూ, ఆ తర్వాత బెంగాల్ లోనూ రెపరెపలాడిన ఆ పతాకం ఆకుపచ్చ, కాషాయం, ఎరుపు వర్ణాలతో కూడినది.
పచ్చరంగులోని వికసించిన ఎనిమిది కమలాలు అప్పటి భారతదేశంలోని ఎనిమిది ప్రాంతాలకు చిహ్నం.
మధ్యలో కాషాయంలో దేవనాగరిలిపిలో "వందేమాతరం" అని రాసి ఉంటుంది.
ఇక అడుగున ఉన్న ఎరుపు వర్ణంలో హిందు -  ముస్లింల ఐకమత్యానికి గుర్తుగా సూర్యచంద్రుల చిత్రాలు కనిపిస్తాయి. 
ఇంతకీ ఆ మహిళ ఎవరో చెప్పలేదు కదూ...ఆమె పేరే భిక్యాజీ రుస్తుం కామా. అందరూ ఆమెను అప్పట్లో మేడం కామా అని పిలిచేవారు.
1861లో జన్మించిన ఆమె 1936లో పరమపదించారు. ముంబైలో పుట్టిపెరిగారు.

కామెంట్‌లు