సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఉల్లము...ఉల్లలము
  *****
 ఉల్లము అనేక ఆలోచనల సంద్రము.అపారమైన జ్ఞానానికి నిలయము.
ఈనాటి ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి కారణం ఉల్లంలో ఉదయించిన అనేకానేక ఆసక్తులు,అన్వేషణల ఫలితం.
ఉల్లము రంజిల్లినపుడే ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
ఉల్లము ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి?అంతరంగం ముందు మనం చేసే ప్రతి పని అద్దంలా కనిపించాలి.అప్పుడే అది మంచా చెడా అనేది స్పష్టత వస్తుంది.
 ఉల్లము అంటే ఏమిటో ఈపాటికి తెలిసిపోయింది కదా...ఉల్లము అంటే మనసు,మది,మనము,హృది, అంతరంగము,సత్వం, స్వాంతము, చిత్తము ఆత్మ,ఎద,ఎడద డెందము, అంతఃకరణము, హృదయము,చేతనము లాంటి అర్థాలు ఉన్నాయి.
మరి ఈ ఉల్లము ఎక్కడా ఓ చోట స్థిరంగా నిలుస్తుందా.. పరీక్షించి చూస్తే అస్సలు నిలవదు. ఉల్లలమై  పరుగులు తీస్తుంది. అందుకే ఉల్లమును కోతిలా ఉల్లలమైనదని అంటారు.
దానిని ఆపడం ఒక్క స్థితప్రజ్ఞత కలవారికే సాధ్యం.
అందుకే ఓ రచయిత "కళ్ళు చూసిన చోటుకు ఉల్లము.ఉల్లము పోయిన చోటుకు ఉల్లలమై మనిషి పోకూడదని" అంటారు.
ఉల్లానికి గవాక్షాలైన కళ్ళను,కళ్ళతో ఉరకలు వేసే ఉల్లాన్ని ఉల్లలము కాకుండా మన అధీనంలో ఉంచుకోవాలి.
ఇంతకూ ఉల్లలము అంటే కూడా తెలిసింది కదా!..ఉల్లలము అంటే చలనము,చాల్యము, చాపల్యం,చలము,లోలత్వము,అస్థిరము,తల్లడము,కంపము,చంచలము లాంటి అర్థాలు ఉన్నాయి.
కాబట్టి ఉల్లమును సదా అదుపులో పెట్టుకోవాలి. ఉల్లలము కాకుండా నిగ్రహాన్ని అలవరచుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు