సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 చేత...చేతన
*****
ఒక్కొక్కరు ఒక్కో చేత చేస్తారు.అది వారి వారి ఇష్టాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఉంటుంది. ఎవరే చేత చేసినా ముందు భుక్తి కోసం,ఆ తర్వాత తృప్తి కోసం.
మరి అలా చేసే చేత ఎప్పుడు కూడా తృప్తి, ఆనందం, ఆదాయం,ఓ గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలి. అప్పుడే చేసిన చేత సార్థకం అవుతుంది.
 చేత అంటే ఏమిటో అర్థమైపోయింది కదా ... చేసే పనినే చేత,చెయిపు, కారము,కార్యము, చేష్ట,కృత్యము,కరణము,ఒంజలి, ప్రయోజనము,క్రియ,చర్య, వ్యాసంగము ఇలా అనేక పర్యాయ పదాలతో పిలుస్తారు.
 చేతలో చేతన ఉండాలి. చేతనతో కూడిన చేత మంచి ఫలితాలను ఇస్తుంది. అందులోనే  సామర్థ్యం, నైపుణ్యం ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
మరి చేతన అంటే ఏమిటో చూద్దాం... జ్ఞానము, విజ్ఞానము,ఇంగము,మతి, మెలకువ, తెలివి,తెలివిడి,ఎఱుక,చిత్తి, చైతన్యము లాంటి అర్థాలు ఉన్నాయి.
 చేతను చేతనతో చేయాలి.తద్వారా వచ్చిన జ్ఞానాన్ని పలువురికి పంచుతూ  చైతన్య వంతంగా జీవితాన్ని సాగించాలి
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు