దీర్ఘకాలంగా వెలుగుతున్న బల్బు;-- యామిజాల జగదీశ్
 విద్యుత్ బల్బు ఆయువు కాలం సరాసరి వెయ్యి గంటలు. అంటే రోజులలో చెప్పాల్సి వస్తే 41.6667 రోజులు. కానీ అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోగల అగ్నిమాపక కేంద్రంలో ఓ విద్యుత్ బల్బు 122 ఏళ్ళుగా ఇప్పటికీ వెలుగుతోంది. 
ఫ్రాన్సుకి చెందిన అడాల్ఫ్ ఛైలెట్ Adolphe Chaillet ఈ విద్యుత్ బల్బుని తయారు చేశారు. ఈయన ఇంజనీర్.
ఈ బల్బుని తయారుచేయడానికి ఆయనకు అక్షరాలా రెండు సంవత్సరాల నాలుగు నెలలు పట్టింది. 
1901లో వెలగటం మొదలుపెట్టిన ఈ బల్బు ఎటువంటి అంతరాయమూ లేకుండా పని చేస్తుండటం అందరోనీ ఆశ్చర్యపరుస్తోంది. ఇకముందు ఇలాంటి బల్బుని ఎవరూ తయారు చేయలేరని సవాల్ విసురుతూ తాను తయారు చేయడానికి రాసుకున్న వివరాలను ఆయన తగులబెట్టేశారు.
అయితే ఆయన సవాలుకు స్పందించి అమెరికాకు చెందిన ఓ బృందం ఇప్పటివరకూ విజయం సాధించకపోవడం గమనార్హం.
అడాల్ఫ్ ఛైలెట్ విషయానికొస్తే ఆయన 1867 జులై 15న లో ప్యారిస్ లో జన్మించారు. ఆయన తొలి రోజుల గురించి ఎవరికీ అంతగా తెలీదు. ఆయన 1878 నుంచి తన తండ్రికున్న ఫ్యాక్టరీలో బల్బుల తయారీలో తోడ్పడుతుండేవారు. ఓ తరగతి గదిలో పాఠాలు చదువుకోవడానికే తంటాలుపడే కుర్రాడు పదకొండేళ్ళకే బల్బుల తయారీలో తండ్రికి సాయపడటం ఆశ్చర్యకరమైన విషయంగా ఇరుగుపొరుగువాళ్ళు చెప్పుకునేవారు. ఆయన తండ్రి సామ్యూల్ అలెగ్జాండర్. తల్లి యుగెనీ ఇవా. ఆమె రష్యన్. అడాల్ఫ్ ఛైలెట్ జర్మనీ, ఫ్రాన్స్ లలో చదువుకున్నారు.
1892 ప్రాంతంలో ఆయన అమెరికాకొచ్చి  కొన్ని సంస్థలలో పనిచేశారు. 
ఆయన విస్తృతమైన అనుభవం గడించి  ఎలక్ట్రీషియన్‌గా మాత్రమే కాకుండా రసాయన శాస్త్రవేత్తగా, ఖనిజ శాస్త్రవేత్తగా కూడా పేరుప్రఖ్యాతులు పొందారు.
1896లో ప్రొఫెసర్ అడాల్ఫ్ ఛైలెట్ తాను సొంతంగా ఓ సంస్థను నడపగలనని కొందరు
వ్యాపారవేత్తలను ఒప్పించి మెరుగ్గా వెలిగే బల్బులతయారీకీ శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో రకరకాల బల్బులను సృష్టించిన ఆయన తయారు చేసిన ఓ బల్బు మాత్రం 1901 నుంచీ ఇప్పటికీ వెలుగుతుండటం విశేషం. 
ఆయన మసాచుసెట్స్‌కు చెందిన మౌడ్ ఎల్. బిక్‌మోరుని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె.
అడాల్ఫ్ ఛైలెట్ 1940 జూన్ 26న కన్నుమూశారు.
కామెంట్‌లు