కవి-పాఠకుడు మధ్య కవితలు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆలోచనలు అలోలములయి
అంతరంగాన ఆవాసమయి
సాయంసమయ ఛాయలయి
తారాడి తందనాలాడుతున్నాయి

రవిని చూచి కిరణాలను చూచి 
జాబిలిని చూచి వెన్నెలను చూచి
పువ్వులను చూచి నవ్వులను చూచి
పిల్లలను చూచి పడుచులను చూచి
పచ్చనివనాలను చూచి ప్రవహించే నదులనుచూచి 
ఎత్తైన పర్వతాలుచూచి లోతైన లోయలనుచూచి
కడలిని చూచి అలలను చూచి
ఆకాశాన్ని చూచి నీలవర్ణాన్ని చూచి
మేఘాలను చూచి తారకలను చూచి
అందాలను చూచి ఆనందాన్ని పొంది
ఆలోచనలో పడి ఆంతరంగాన మదించి
పొరుగువారితో మాట్లాడి పుస్తకాలను చదివి
కనులు తెరచి చెవులు విప్పి
మనసు విప్పి విషయం తట్టి
కలమును పట్టి కాగితము తీసి
కవితను వ్రాసి సంబరపడుతున్నాడు కవి

పఠించి గానంచేసి
వినిపించి శ్రావ్యతనిచ్చి
ముఖపుస్తక సమూహాలకుపంపి
వాట్సప్పు సముదాయాలకుపంపి
ఇంస్టాగ్రాముకి పంపి ట్విట్టరులో ట్వీటుచేసి
బ్లాగులో పెట్టి వాలులో పెట్టి
అంతర్జాలములో పంపి పలువురికి చేర్చి
ఈమైలు చేసి శ్రమపడుతున్నాడు కవి

పాఠకులు చదివి అక్షరాలకూర్పుకు అబ్బురపడి
పదప్రయోగానికి ముగ్ధులయి ప్రాసల అమరికజూచి
లోతైన భావాలుకని పరవశించి
మనసున నిలుపుకొని వ్యాఖ్యలు వ్రాసి
ప్రశంసించి కవికిపంపి
సంతసపడుతున్నాడు ఒకచదువరి 

పాఠకుల ఇష్టాలకు వ్యాఖ్యలకు 
స్పందనలకు ప్రతిస్పందనలకు
ప్రోత్సాహానికి ప్రశంసలకు
భాగస్వామ్యాలకు ఆనందపడి పొంగిపోయి
ధన్యవాదాలుచెప్పి మురిసిపోతున్నాడు కవి

బాగుబాగు కవి ముందుకుసాగు కవి
మనసులతట్టు కవి మదులమురిపించు కవి
కలాన్నివదలకు కవి కవితలుమానకు కవి
సాహితీసేవచెయ్యి కవి చిరంజీవిగా నిలచిపోకవి
బళారే కవి చాంగురే కవి
జైజై కవి శబాసు కవి

=====================

అలోలము= కదలు
ఆవాసము= నివాసము, ఉండు

కామెంట్‌లు