"ఆ సంతకం నాదేనయ్యా";-- జగదీశ్ యామిజాల
 ఆయన తన కారులో పెట్రోల్ పోయించుకోవడంకోసం ఓ పెట్రోల్ బంకుకి వెళ్ళారు. పెట్రోల్ పోసిన అక్కడి సిబ్బంది ఒకడికి ఆయన వంద రూపాయల నోటిచ్చారు.
అయితే ఆ వ్యక్తి "సార్, ఈ నోటు మీద సంతకం చేసివ్వండి. లేకుంటే తీసుకోవద్దని మా యజమాని చెప్పారు. కారణం మరేమీ లేదండి. వంద రూపాయల నకిలీ నోట్లు చలామణిలో ఉండటం వల్ల ఎవరు వంద రూపాయలు ఇచ్చినా నోటుమీద వారి  సంతకం తీసుకోవలసి వస్తోంది" అని వినయంగానే చెప్పాడు.
అయితే పెట్రోల్ పోయించుకున్న పెద్దాయన "అంతే కదా" అంటూ వంద రూపాయల నోటుపై సంతకం చేసిచ్చారు.
కానీ పెట్రోల్ బంక్ నౌకరు ఆ నోటుని అటూ ఇటూ తిప్పి చూసి "సార్, నేనడిగింది మీ సంతకం సార్...కానీ మీరు ఆ వంద రూపాయల నోటులో ముద్రించి ఉన్న సంతకాన్నే రాశారేంటీ...ఈ రెండు సంతకాలూ ఒకేలా ఉన్నాయి...ఏమిటి సార్ ఇది?" అని అడిగాడు.
అప్పుడా పెద్దాయన "చిన్న నవ్వు నవ్వుతూ "ఆ వంద రూపాయల నోటులో ముద్రితమై ఉన్న సంతకం నాదే కనుక ఇప్పుడు నేను చేసిన సంతకమూ అట్లాగే ఉండకుండా మరెలా ఉంటుంది? నేను సర్వీసులో ఉన్న రోజుల్లో నాటి నోటు కనుక అప్పట్లో నా సంతకం ఉంది. అంతకన్నా మరేమీ కాదు. అనుమానించక నోటు తీసుకో" అన్నారు.
ఈ అనుభవానికి సొంతదారు ఇంకెవరో కాదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ హెచ్. వి.ఆర్. అయ్యంగార్.
ఆయన పూర్తి పేరు హరవు వెంకట నరసింస వరజ రాజ్ అయ్యంగార్. ఆయనను హెచ్. వి. ఆర్. అనే పిలిచేవారు.
1902 ఆగస్ట్23న జన్మించిన ఆయన 1978 ఫిబ్రవరి 22న కన్నుమూశారు. 
1957 మార్చి ఒకటో తేదీ నుంచి 1962 ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పని చేశారు ఆయన రిజర్వ్ బ్యాంకుకి ఆరవ గవర్నరు.
ఆయనను భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది. 
ఆయన శత జయంతిని పురస్కరించుకుని 2002లో ఆయన వ్యాససంపుటిని ఆవిష్కరించారు. ఆయన వ్యాసాలను అయ్యంగార్ కుమార్తె ఇందిర, అల్లుడు బిపిన్ పటేల్ సంకలన పరిచారు.

కామెంట్‌లు