"తలపుల కుసుమాలు";-నలిగల రాధికా రత్న.
ఏ అనుభూతులు లేని 
మరబొమ్మలా మౌనంగా ఉన్నా...
తేనె మధువంత  తియ్యనైన
నీ అనురాగాన్ని ఆస్వాదిస్తున్నాను....!! 

దిగులు సాయంత్రాలు 
ఎర్ర జీరలై కళ్ళలో నిలుస్తున్నా
తాంబూలమంత ఎర్రనైన
నీ మైత్రి ముచ్చట్లతో 
మురిసిపోతున్నాను....!!

కనురెప్పల వాలిన వేదన 
నిద్రను దూరం చేస్తున్నా
పచ్చదనమంత స్వచ్ఛమైన
నీ ప్రేమ ప్రకృతిలో
లీనమౌతున్నాను...!!

కాలచక్రం నిత్యం చలిస్తూనే ఉండే 
భ్రమణ శీలి...అని తెలిసినా...
శీతల సమీరం కోసం 
శరన్మేఘం ఎదురుచూస్తున్నట్లు...
అనునిత్యం 
"తలపుల కుసుమాలతో"
ఎదురు చూస్తున్నా...!!


కామెంట్‌లు