ఇదో జబ్బు;-- యామిజాల జగదీశ్
 ఆయన ఓ విచిత్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కానీ ఆయన నలుగురి మధ్యే ఉన్నాడు. ఆయన ధనవంతుడు. ఆయన మానసిక వ్యాధి మరేదో కాదు. అందరూ తనను పొగుడుతూ ఉండాలనుకుంటాడెప్పుడూనూ.
ఎప్పుడూ తన చుట్టూ నలుగురు ఉండాలనుకుంటాడు.
విరాళం అనే పేరిట డబ్బులు వెదజల్లాడు.
అటువంటి మనిషి వెంట నలుగురేమిటీ నాలుగు వేల మంది కూడా ఆయన చుట్టూ ఉంటారు.

వారందరినీ చూసి ఆయన సంతృప్తి చెందేవాడు.

ఆయన ఓ దాత అనే పేరు నలువైపులా వ్యాప్తించింది
ఆయన ఖజానాలో డబ్బు తరగనారంభించింది.


విషయం తెలిసి నలుగురూ దూరమవుతూ వచ్చారు.
పిచ్చోడు...వెర్రోడు అని ఆయనను చెప్పుకోవడం మొదలుపెట్టారు.
ఇటువంటి మాటలతో అవమానాలెలా ఉన్నా తన చుట్టూ ఎవరూ లేరే అని దిగులు. అది ఆయనను పిండేసింది. ఉన్నట్టుండి ఆయనకు ఓ ఆలోచన వచ్చింది.

అన్నాన్ని విసిరాడు. ఇంకేముంది....
కావ్...కావ్.....కావ్.... అంటూ బోలెడు కాకులు  ఆయను చుట్టూ మూగాయి.
ఆయనకు మళ్ళీ ఆనందం....
అన్నం మెతుకులు తినడం అయిపోయిన తర్వాత కాకులన్నీ ఎగిరిపోయాయి...
ఇప్పుడు ఆయన తల, భుజం, వీపు, అంతటా కాకుల రెట్టలు....
ఆ క్షణాన ఆయన మొదటిసారిగా ఆలోచించడం మొదలుపెట్టాడు.

కామెంట్‌లు