సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 నిజము... నిజాము
  *******
వ్యక్తి యొక్క వైఖరి ఎలాంటిదో  మాట్లాడే మాటలను, ప్రవర్తించే తీరును బట్టి చాలా వరకు తెలుస్తుంది.
నిజము నిప్పు లాంటిది.అందుకే నిజము మాట్లాడే వ్యక్తులంటే ప్రజల్లో భయమూ భక్తీ ఉంటాయి.
నిజము అంటే ఏమిటో అందరికీ తెలిసిందే.సత్యము,ఋతము, నిక్కము,సత్తు, వాస్తవము,భూతార్థము,నిబద్ది, యధార్థము,సత్తెము,సత్యకము తో పాటు విధము,తీరు,వాలకము, రకము,వైఖరి,తెన్ను లాంటి అనేక అర్థాలు కూడా ఉన్నాయి.
"యథార్థ వాది లోక విరోధి"  అంటుంటారు. ఎందుకంటే అబద్ధాలతో పబ్బం గడుపుకునే నయవంచకులకు ఏనాటికైనా నిజమే గెలుస్తుందని తెలుసు కాబట్టే సత్యము, ధర్మము పాటించే వారు విరోధులుగా కనిపిస్తారు.
నిజము మాట్లాడటం మన నైజం కావాలి.అప్పుడే మన మనశ్శరీరాలకు నిజాము అవుతాము. మనో వాక్కాయ కర్మలకు, ఇంద్రియాలకు మనమే నిజాము అని తెలుసుకొని మసలుకోవాలి.
 
నిజాము అనగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన నైజాం నవాబు గుర్తుకు రావడం సహజం. మరి నిజాము అంటే అర్థాలు ఏమున్నాయో చూద్దాం.
రాజు, అధిపతి, చక్రవర్తి,అవనీపతి, భూపతి,ఏలిక,సామ్రాట్టు, సార్వభౌముడు,ధరణీపతి, శ్రీపతి ఇలా నిజాము పదానికి అనేక అర్థాలు, పర్యాయపదాలు  ఉన్నాయి.
 మన మనసుకు, దేహానికి రాజు, అధిపతి మనమేననీ అర్థం చేసుకోవాలి.
నిజమును ఆభరణంగా ధరించాలి. నిజాముగా స్వాభిమానంతో ఉండాలి.అప్పుడే  సమాజంలో గౌరవం గుర్తింపు లభిస్తాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు