సుప్రభాత కవిత ; -బృంద
కొండల మధ్య చిన్న రేఖగా
మొదలైన వెలుగు
క్రమక్రమంగా గగనమంతా
అరుణమయం చేసింది

క్షణక్షణం ఎదుగుతూ
అదుపే లేక అవని
అణువణువునూ వెలుతురు
ఆక్రమించేసింది

వెలుగుల పండుగ
తనకే సొంతమనుకుని
బుగ్గలెర్రబడగా 
సిగ్గుపడ్డ నింగి..

వెలుగుల వెల్లవేసినట్టున్న
నేల వంక తొంగి చూసి
రంగురంగుల అందాలకు
అబ్బురపడి తెల్లబోయింది

సప్తవర్ణాల చీర కట్టిన
ప్రకృతి కాంత
మురిపెంగా చూసుకుంటూ
సర్దుకుంటే రాలిపడ్డ ఆకులు.

వరాల ఒప్పందాలపై
చిరునవ్వుల సంతకాలు
కోరిన వెచ్చని వేకువను
అక్కున చేర్చుకుని

అందమైన క్షణాలను
పొందికగా పోగుచేసుకుని
ఆనందంగా ఉండమని
అందరికీ చెబుతున్న

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు