తిండిలో చారు ;- నాగపట్ల భక్తవత్సల రెడ్డి /తిరుపతి

  సహృదయ సాహితీ ప్రేమికులకు, నమస్కారం
సంప్రదాయ ఆహారపు అలవాట్లలో మనం చాలా పోగొట్టుకొన్నాం. కాలం మారుతున్నపుడు మనం కూడా కాలానికి అనుగుణంగా మారక తప్పదు. అయితే ఈ మార్పు ఇతరులని అనుకరించడం వల్ల తెచ్చిపెట్టుకున్న మార్పా లేక మన పునాది ఆధారంగా కాలానుగుణంగా ప్రాంతీయ వాతావరణ నేపధ్యంగా చేసుకుంటున్న మార్పా అన్న దాని మీద స్పష్టత ఉండాలి. సంప్రదాయ వంటల్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నపుడు కొన్ని కాలానికి తగ్గట్టు మరికొన్ని శరీర ప్రకృతికి తగ్గట్టు, ఇంకా కొన్ని ప్రాంతీయతని అట్టిపెట్టుకుని ఉన్నట్టు చూడగలం. వైవిధ్యమున్న వంటల్లో వైవిధ్యమున్నచారు కూడా ఒకటి. అలాంటి చారుల ని గురించి ముచ్చటించుకోవడం నేటి మన ముచ్చట. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జానపదగిరిజన విజ్ఞానపీఠం వరంగల్లు, వరంగల్లు, తూర్పు గోదావరి జిల్లాల్లో జరిపిన క్షేత్రపర్యటన సమాచారం దీనికి ఆధారం. ఆ సమాచారమంతా విషయదాతల పరంగా నోటు పుస్తకాలలోకి ఎక్కించడమే కాకుండా గ్రామాల ఆధారంగా, ఒక్కో ప్రక్రియకి సంబంధించిన రిపోర్టులు కూడా తయారు చేసినారు. 1995 నుంచి ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది.
అల్లం చారు, ఉలవపప్పు చారు, కంద చారు, కందిపప్పు చారు, గుణ చారు, చింత పండు చారు – పలుచని చారు – పిక్క చారు, తర్వాని చారు - కలి చారు, నల్లేరుకాడ చారు, నిట్టపప్పు చారు, పచ్చిపులుసు – గొడ్డు పులుసు, పులగాల చారు, మిరియాల చారు, వాము చారు, లక్ష్మీ చారు, పులిసిన గంజి – చారులో వాడుకొనే వస్తువులని బట్టి, తయారు చేసే విధానాన్ని బట్టి చారులు పలు రకాలు. మారే క్రమాన్ని బట్టి వాటి గుణాలు కూడా మారతాయన్నది గమనించాల్సిన విషయం. 
చారు అంటేనే చింతపండు రసం. చింతకాయల్ని ఉడకబెట్టి కూడా. వీటికన్నా భిన్నంగా కలి – తర్వాని ఉపయోగించి చేసే చారులకి అనుష్ఠాన నేపధ్యం ఉంది. కంద చారులో పచ్చి చింతకాయలను నీటిలో ఉడకబెట్టి చారును పిసికి, కంద ముక్కలను నీటిలో ఉడికించి, తొక్క తీసి, రోట్లో వేసి దంచి, ఈ దంచిన ముద్దను చారులో కలిపి, ఈ చారులో రొయ్యలను వేసి ఉడికించి, తరువాత తాళింపు పెడుతారు. ఉలవపప్పును నీటిలో ఉడికించి, ఆ నీటిని చింతపండు రసంలో కలిపి, ఉప్పు, కారం వేసి మరిగించి, ఒక దాకలో నూనె పోసి, తాళింపు పెట్టి, అందులో మరిగించిన చారును పోసి ఉలవ చారు చేస్తారు. కందిపప్పు చారు కందిపప్పును నీటిలో ఉడికించి, దానిలో ఉప్పు, కారం, చింతపులుసు పోసి మరగనిచ్చి, తాళింపు పెడుతారు. ఒక గుణలో నూనెపోసి అనపకాయ, ములగకాడలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, టమాటా, బెల్లం, చింతపండు, కందిపప్పు అన్నింటినీ వేసి వేయించి, నీళ్ళు పోసి మరిగించి, ముక్కలు కొద్దిగా ఉడికిన తరువాత అల్లం వెల్లుల్లి జిలకర కలిపి రుబ్బిన ముద్దను కూడా వేసి, ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి, ఈ తాళింపును మరుగుతున్న చారులో పోసి, గుణచారును చేస్తారు. చింతపండును నీటిలో నానబెట్టి, రసం తీసి, ఒక దాకలో నూనె పోసి, అందులో జిలకర, కరివేపాకు, ఎండమిర్చి వేసి తాళింపు పెట్టి, అందులో చింతపండు రసం పోసి, చారును చేస్తారు. తర్వానీ చారు బెండకాయ ముక్కలు, నెల్లికూర, బలుసు కూరలను ఒక దాకలో నీళ్ళలో ఉడికించి, అందులో ఉప్పు, కారం వేసి దించి, మరొక దాకలో నూనె పోసి, తాళింపు పెట్టి, అందులో ఉడికించిన చారు పోసి, మరిగించి దించుతారు.  నల్లేరుకాడ చారు గరం మసాలా, ఎండుమిర్చి,అల్లం అన్నింటినీ కలిపి సన్నికల్లుమీద మెత్తగా నూరి, ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి అందులో నల్లేరు కాడలు, మసాలా ముద్ద వేసి, చింతపండు పులుసు పోసి, ఉప్పు వేసి మరిగించి దించుతారు. నిట్టపప్పు చారు నిట్ట పప్పును నీటిలో ఉడికించి, ఉప్పు, కారం వేసి మరగబెడుతారు. కొందరు ఈ కూరను మరిగించిన తరువాత తాళింపు పెడుతారు. కొందరు తాళింపు పెట్టకుండానే వండుతారు. పచ్చిపులుసు చింతపండును నానబెట్టి పులుసు చేసి, అందులో అరటిపండు, కాల్చిన వంకాయలను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను పిసికి కలుపుతారు. పులుసును వేడి చేయరు. కొన్ని చోట్ల తెల్ల వంకాయలను, పచ్చి మిరపకాయలను నిప్పుల మీద కాల్చి, చింతపండు రసంలో పిసికి, ఉప్పు, బెల్లం కలుపుతారు, తాళింపు పెట్టరు. ఇంకా వంకాయ, అరటికాయ, ఉల్లిపాయలను నిప్పులమీద కాల్చి, వాటిని చింతపండు రసంలో వేసి పిసికి చారు చేస్తారు. ఈ చారుకు తాళింపు పెట్టరు.  చింతపండును నీటిలో నానబెట్టి, రసం తీసి, ఒక దాకలో నూనె పోసి, అందులో జిలకర, కరివేపాకు, ఎండమిర్చి వేసి తాళింపు పెట్టి, అందులో చింతపండు రసం పోసి, కొద్దిగా నీళ్ళను ఎక్కువగా పోసి, పలుచని చారును చేస్తారు. మిరియాలు, జిలకర, ధనియాలు అన్నింటినీ కలిపి సన్నికల్లు మీద మెత్తగా నూరి, ఒక దాకలో నూనె పోసి, తాళింపు పెట్టి, అందులో నూరిన ముద్దను వేసి వేయించి, చింతపండు రసం పోసి కలిపి, మిరియాల చారును చేస్తారు. 
ఒక దాకలో నూనె పోసి, అందులో ఉల్లిపాయలు, నువ్వులు, కారం వేసి తాళింపు పెట్టి, అందులో చింతపండు రసం కలిపి లక్ష్మీ చారును చేస్తారు. ఇంకా గంజి ఒక పాలు, బియ్యం కడుగు నీళ్ళు రెండుపాళ్ళు కలిపి లక్ష్మీ చారును చేస్తారు. పులిసిన గంజిలో చింతపండు లేకుండా పులిసిన గంజిలో ఉల్లిపాయలు, ఉప్పు, కారం, ఎండు రొయ్యలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి, తాళింపు పెడుతారు. పులగాల చారు ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి, అందులో మామిడి బద్దలు, రొయ్యలు, మెత్తాల్లు, ఉప్పు, కారం, వర్ర, తర్వాని వేసి, నీళ్ళు పోసి ఉడికించి దించుతారు. కొంత మంది ఒక దాకలో నూనె పోసి తాళింపు పెట్టి, అందులో మామిడి బద్దలు, ఉల్లిపాయలు, వర్ర, ఉప్పు, కారం వేసి, మరిగించి దించుతారు.  
కంద చారు ఎక్కువగా తింటే అజీర్ణం చేస్తుంది. గుణ చారుని పూర్వం ప్రత్యేకంగా పెళ్లిళ్లకు చేసేవారు. రెండు రోజుల దాకా నిల్వ ఉంటుంది. తర్వాని చారుని బాలింతలకు, పుష్పవతికి పెట్టరు. కాని కొత్త కాపురం పెట్టినపుడు చేస్తారు. నల్లేరు కాడ చారు, మిరియాల చారు పైత్యాన్ని తగ్గిస్తాయి. బెల్లం కలిపి చేసే పచ్చిపులుసుని సేనాపతులు ఎక్కువగా చేసుకుంటారు. లక్ష్మీ చారు ఎక్కువగా తాగితే వేడి చేస్తుంది.
ఈ చారుల తయారీలో చింతపండు, చింతకాయలతో పాటు పులిసిన గంజి – తర్వాని - కలి నీళ్లు - కూరాడు కలి వాడుకోవడం కూడా ఉంది. తెలంగాణా లో కూరాడు కుండగా, కోస్తా ప్రాంతంలో తర్వాని గా, నెల్లూరు ప్రాంతంలో కలికుండగా ప్రచారంలో ఉన్న కలి కి ఇందులో ప్రాధాన్యత ఉంది. 
ఓ కొత్తకుండని తెచ్చి పసుపురాసి బొట్లు పెట్టి నైఋతి మూలకు చుట్టకుదురు వేసి దాని మీద పెడతారు. అన్నం వండినాక వార్చిన గంజిని కొంత అందులో పోస్తారు. రెండో రోజు కొంత గంజి పోస్తారు. మూడోరోజు మరికొంత గంజి పోస్తారు. గంజి పులుస్తుంది. చారు చేసుకొనేటపుడు ఆ పులిసిన గంజిని కొంత కుండలో ఉంచి మిగతాది ఒక దాకలో పోసి, అందులో ఉల్లిపాయలు వంకాయ పచ్చి మిర్చి ఉప్పు కారం బెండకాయలు, ఎండు రొయ్యలు, వేసి పొయ్యి మీద పెట్టి కాచి, తాళింపు పెట్టుకొంటారు. శుక్ర, మంగళ వారాల్లో ఈ కుండని బెడతారు కాని ఆ గంజితో చేసిన చారు ని మాత్రం ఇతరులెవరికీ పోయరు. అలా పోస్తే తమ ఇంట్లోని లక్ష్మి తొలగిపోతుందని భావిస్తారు. ఈ కుండ ఇంటిలో ఉంటే లక్ష్మి గా భావిస్తారు. అయితే ఈ కుండని సంక్రాంతి నెలపట్టు మాసం (ధనుర్మాసం) లో పెట్టరు. ఎందుకంటే ఈ పండగ రోజుల్లో శంకరుడు వచ్చి “పులగాల” కుండలో కూర్చుంటాడని, శంకరున్ని ఇంటిలో బంధించినట్టవుతుందని ఈ నెల రోజులు కుండని తీసేస్తారు. ఈ చారు రుచికి పుల్లగా ఉంటుంది. వర్షకాలంలో పులిసిన గంజి వల్ల రొంప చేస్తుంది. వేసవి కాలంలో చలువదనం కోసం ఈ చారు ఎక్కువగా చేసుకొంటారు. కుండలో మిగిలి ఉన్న పులిసిన గంజిని అన్నం వండే ముందు ఎసట్లో ఒక పాలు పోసి వండితే అది సాయంత్రం దాకా పాడవదు. ఈ లక్ష్మీ చారును కాచేటపుడు పాత రోజుల్లో ఈ పాట పాడేవారు – లచ్చిమి చారమ్మలారా లచ్చిమి చారో, పొంగిపోతే దెంగి లేదు లచ్చిమి చారో, కాకినాడ కరేపాకు లచ్చిమి చారే, బెండకాయ ముక్కలకి లచ్చిమి చారే, ఆగు తాగేత్తాడమ్మాలారా లచ్చిమి చారే, లచ్చిమి చారమ్మాలారా లచ్చిమి చారే, పొంగిపోతే దెంగి లేదు లచ్చిమి చారే, బెజవాడ బెండకాయ లచ్చిమి చారే, ఏలూరి ఎండు రొయ్యలు లచ్చిమి చారే, ఆడు తాగేత్తాడమ్మలారా లచ్చిమి చారు, లచ్చిమి చారమ్మలారా లచ్చిమి చారే, పొంగిపోతే దెంగి లేదు లచ్చిమి చారే, ఆడు తందనాలాడతాడు లచ్చిమి చారే, ఇరుగమ్మ పొరుగమ్మ లచ్చిమి చారే, తాగేత్తాడమ్మలారా లచ్చిమి చారే, ఆడు తాగేత్తాడమ్మలారా లచ్చిమి చారే – అంటూ ఒక్కో పాదాన్ని రెండేసి సార్లు పాడతారు (తూర్పు గోదావరి జిల్లా పల్లిపాలెం నుంచి సేకరణ). 
ఈ పాటని కూడా చేర్చుకొంటే లక్ష్మీ చారు ని ప్రత్యేకంగా చూస్తున్నట్టు అర్థమవుతుంది. ఇందులో 1. వేసవికాలంలో చలువచేస్తుంది, అందుకని తాగుతారు. వర్షాకాలంలో రొంప జేస్తుంది అందుకని తాగరు. అంటే దీని గుణం కాలానుగుణంగా ఉంటుందన్నమాట. 2. పాటలో మగడు తాగేత్తాడని,  తాగినపుడు తందనాలాడతాడని చెప్పడం ఆలోచించాల్సి ఉంది. అలాగే తయారు చేసేటపుడు పొంగితే ఆ గుణం (తందనాలాడడం) పోతుందని కూడా పాట చెబుతుంది. 3. ధనుర్మాసంలో ఈ లక్ష్మీకుండను పెట్టరు. అంటే లక్ష్మీచారుకి, మగసిరికి ఏదో అవినానుభావ సంబంధం ఉందన్న విషయం గుర్తించవచ్చు కాని నిర్ధారించడానికి మరికొన్ని ఆధారాలు కావాలి. లక్ష్మీచారుని ఐశ్వర్యానికి ప్రతీకగా (లక్ష్మి అంటేనే ఐశ్వర్యం కదా) పవిత్రంగా చూసుకొంటున్నారు. దానికి తగ్గట్టుగా కథలు, నమ్మకాలు కనబడుతున్నాయి. పాటని, నమ్మకాలని, ఆచారాలని, ఉపయోగాలని కలుపుకొని చూస్తే ఆ ఐశ్వర్యంలో మగసిరిని కూడా కలుపుకొన్నారన్న విషయం అర్థం అవుతుంది. ధనుర్మాసం మొత్తం మగసిరిని నియంత్రించుకోవాలన్న ధ్యాసని ప్రేరేపించేవే కనుక ఈ లక్ష్మీ చారుకు కూడా ఆ గుణం ఉందని ఆంతర ప్రమాణాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకు ధనుర్మాసంలో పెట్టరాదు అన్న ఆంక్ష వెనుక ఈ నమ్మకం బలంగా ఉన్నట్టు గుర్తించగలం.
సాహితీ ప్రేమికులు, జానపదవిజ్ఞాన పరిశోధకులు మరిన్ని విషయాలతో స్పందించగలరని ఆశిస్తూ, నాగపట్ల భక్తవత్సల రెడ్డి /తిరుపతి 
కామెంట్‌లు