తలతిక్క రాజు!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరాజు మంచివాడేకానీ కాస్త తలతిక్కవాడు.మంత్రి యుక్తి సమయస్ఫూర్తితో జనం కిమ్మనకుండా ఉన్నారు. ఆరోజు నది దగ్గరికి రాజు మంత్రి షికారుకెళ్లారు.పడమటినుంచి తూర్పు వైపుగా పారుతోంది. "మంత్రీ!మన రాజ్యానికి ఈనది ఎటునించి వస్తోంది?" "ఆతూర్పున ఉన్న రాజ్యంనించి!" "ఏమిటీ మన నీటిని తూర్పున ఉండేవారు వాడుకుని పంపుతున్నారా?అలా జరగడానికి వీల్లేదు. మన రాజ్యపునీరు మన దగ్గరనే ఆగాలి.వేరే చోటికి వెళ్లరాదు.అటూఇటూ  గోడలు కట్టించు నదికి!" తలతిక్కవాడు చెప్పింది చేయకుంటే తల తీసేరకం! అలాగే గోడలు కట్టించాడు మంత్రి. నీరు అడవులు  పొలాల గుండా నగరంలోకి ప్రవేశించి వరదముంచెత్తింది.అంతా మంత్రి దగ్గరికి పరిగెత్తి "మాఇళ్లు సామాన్లు పొలాలు నీటిలో మునిగి పోతున్నాయి " అని గగ్గోలు పెట్టారు. మంత్రి ఉపాయం ఆలోచించి తన మహల్ పై ఉన్న పెద్ద గంటను మోగించే భటుని పిల్చాడు."ఇవాళ సాయం త్రం 6నుంచి అరగంట కోసారి సమయం తెలిఫే గంట మోగించు.ఆరు ఏడు..ఇలా!" రాత్రి 12కి తెల్లారి  ఆరు ఐనట్లు గంటలు కొట్టడం తెల్లారి మోగే సన్నాయి డోలు వినపడటంతో రాజు లేచాడు.కానీ చిమ్మచీకటి.నక్షత్రాలు మెరుస్తున్నాయి.సూర్యుడు రాలేదేంటి? అని ఆలోచిస్తూ ఉండగా రాజప్రాసాదంలోని గుడిలో అభిషేకాలు అర్చన మంత్రాలు వినపడసాగాయి.కానీ సూర్యుడి జాడలేదు. మంత్రి కి కబురంపాడు."ఇంకా అర్ధరాత్రి లాగాఉంది.ఇప్పుడు పూజ ఏమిటి?" "రాజా! మనం ఇంక సూర్యుడుని చూడలేము.మనం తూర్పుదిక్కున గోడ కట్టాం.అందుకే వారు మనవైపు సూర్యుడు రాకుండా  ఆపేశారు. పంటలు పండవు.చీకటి బతుకు! పగలు అనేది మనకు ఉండదు.ఇలా ఐతే మనకి నీరు ఇచ్చే నదికూడా మాయం అవుతుంది. చీకటి గా ఉంది అని ప్రజలు నిద్రలేవరు.రాజ్యం కూడా మాయం ఐపోయే గడ్డురోజులు దాపురిస్తాయి." రాజా బుర్ర గిర్రున తిరిగింది "అహహ!అలా జరగకూడదు.అటూఇటూ గోడలు బద్దలు కొట్టించు.సూర్యుడు మళ్ళీ వచ్చేలా చేయి". ఆదెబ్బతో తెల్లారేప్పటికి గోడలు బద్దలు కావటం నదినీరు పారడం తో పాటు సూర్యుడు యధావిధిగా నవ్వుతూ రావడం తో రాజు హమ్మయ్య  అని నిట్టూర్పు విడిచాడు. ఈకథ అతిశయోక్తి గా అనిపిస్తుంది. కానీ నేడు రెండు రోజులు వర్షం దంచి కొడితే దేశంలో వివిధ కాలనీలు ప్రాంతాల్లో నీరు ఎలా ముంచెత్తుతోందో మనం చూస్తూ ఉన్నాంకదా?🌹
కామెంట్‌లు