"మెరుపు కలల సరాగాలు ";-నలిగల రాధికా రత్న.
పాడిపంటలతో ....
పైరు సిరులతో ....
కళకళలాడే జీవనాడి పల్లెటూరు...!!

పచ్చదనాల తోరణాలు 
అనుబంధాల హరివిల్లులు
అనురాగపు పునాదులు 
పల్లె సీమ అందాలు...!!

ఆత్మీయ పలకరింపులు,
ప్రేమ సువాసనలు ,
పల్లె భామల 
శ్రమజీవన సౌందర్యాలు...!!

అందచందాల పల్లె ప్రకృతిలో
అమ్మలక్కల ముచ్చట్లకు 
అంతే లేదు...
మంచినీటి బావి దగ్గర
ముద్దుగుమ్మల ఆనందాలకు 
హద్దే లేదు...!!

చూడ చక్కని దృశ్యం 
పట్న వాసన కానరాదు
నేడు ఈ కనువిందైన మురిపెం...!!

స్వచ్ఛమైన స్నేహబంధం 
పల్లె మనుషుల 
కల్మషం లేని 
హృదయ రాగం...!!

మిలమిలలాడే
లేత చిగుళ్ళ జ్ఞాపకాలు
కడిగిన ముత్యాలై 
ఒకరికొకరు పంచుకునే 
"మెరుపు కలల సరాగాలు "


కామెంట్‌లు