అతి పెద్ద పుస్తకాలయం;-- యామిజాల జగదీశ్
 తమిళనాడులోని కోయంబత్తూరులో జి.వి. రెసిడెన్సీ ప్రాంతంలో "ఆమ్ని పుస్తకాలయం" ఉంది. మన భారత దేశంలో అతిపెద్ద ప్రైవేట్ లైబ్రరీగా ఇది చరిత్రపుటలకెక్కింది. 
పీళమేడుకి చెందిన పారిశ్రామికవేత్త గోవిందరాజ్ తన సోదరులైన యువరాజ్, శ్రీధర్ లతో కలిసి ఈ గ్రంథాలయాన్ని  ప్రారంభించారు.
యువకులు, చిన్నపిల్లలలో పుస్తకపఠనాన్ని పెంచి ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైం దీ పుస్తకాలయం 
మూడంతస్తుల భవనంలో ఉన్న ఈ పుస్తకాలయంలో రెండు లక్షలకుపైగా పుస్తకాలున్నాయి. ఎ.సి. గదులున్నాయి. అలాగే లిఫ్ట్ సౌకర్యంకూడా ఉంది.
తమ గ్రంథాలయం గురించి వ్యవస్థాపకుడు గోవిందరాజన్ మాట్లాడుతూ "ఈ పుస్తకాలయంలో చిన్న పిల్లలకోసం వేలాది పుస్తకాలున్నాయి.  నెలకు 225 రూపాయలు చెల్లించి ఈ గ్రంథాలయ సభ్యత్వం తీసుకోవచ్చు. ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ ఈ గ్రంథాలయం తలుపులు తెరిచే ఉంటాయి. తమిళం, ఇంగ్లీషు, మళయాలం, హిందీ తదితర భాషలలో రెండు లక్షల పుస్తకాలు ఉన్నాయి. లైబ్రరీ విస్తీర్ణం ఆరు వేల చదరపు అడుగులు. కథల పుస్తకాలు, పరిశోధక పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, వ్యాససంపుటులు, ఇలా అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాం. పుస్తకాలను ఇళ్ళకు తీసుకువెళ్ళి చదివి పదిహేను నుంచి ముప్పై రోజులలోపు తిరిగివ్వాల్సి ఉంపుంది. ఎన్ని పుస్తకాలైనా చదువుకోవచ్చు.
గత ఏడాదిగా యువకులు అధిక సంఖ్యలో పుస్తకాలు చదువుతున్నట్టు మా అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంఖ్యనం మరింత పెంచడమే మా లక్ష్యం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ పుస్తకాలయాన్ని నడుపుతున్నాం.
చెన్నైలో ఉన్న మా ఓం శక్తి పుస్తక కేంద్రంతో పొందిన అనుభవంతో కోయంబత్తూరులో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసాం. ప్రజలకు సేవ చేయడమే ప్రధాన ఆశయం. త్వరలోనే గ్రామాలలోనూ పుస్తకాలయాలను ప్రారంభించిలని ఉంది" అని చెప్పారు.
ఇదిలా ఉంటే ఒక్క వ్యక్తి ఒంటి చేత్తో నడుపుతున్న మరొక పెద్ద గ్రంథాలయంకూడా తమిళనాడులోని విరుదాచలంలో ఉంది. పాత పుస్తకాలను వెతికి వెతికి సేకరించి నిర్వహిస్తున్న ఆ వ్యక్తి పేరు పల్లడం మాణిక్యం. అందరూ ఈయనను పులవర్ అని పిలుస్తారు. పులవర్ అంటే తెలుగులో కవి అని అర్థం.
అన్నామలై విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లోనే పుస్తకాలను సేకరించడం ఆయన అలవాటుగా ఉండేది. ఈరోజు ఆయన దగ్గర లక్ష పుస్తకాలదాకా ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం పుస్తకాలు పరిశోధన చేసే విద్యార్థులకు ఉపయోగపడుతుంటాయి. రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ప్రచురించిన ఓ నిఘంటువు, సంగ కాల (తమిళ సాహిత్య చరిత్రలో పురాతనమైన శకం) సాహిత్యం, తదనంతర కాలానికి చెందిన సొహిత్య సంపుటాలు, అలాగే  ప్రథమ ముద్రణ ప్రతులూ ఇక్కడ కనిపిస్తాయి. తమిళులు వేదంగా చెప్పుకునే తిరుక్కురళ్ కు సంబంధించి పదిహేను వందల మందో రాసిన వ్యాఖ్యానాలు ఈ గ్రంథాలయంలో పొందుపరిచారు. కంబ మహాకవి, ఇళంగో, సుబ్రహ్మణ్యభారతి, తదితరుల రచనలుకూడా అందుబాటులో ఉంచిన కవి పల్లడం మాణిక్యం నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, తమిళనాడులోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆవిష్కరించిన పుస్తకాలు, మత గ్రంథాలు, సిద్ధాంత శాస్త్రాలు, నాలాయిర దివ్య ప్రబంధం, ఇలా అనేక పుస్తకాలను ఒక్క వ్యక్తి సేకరించి అందరికీ ఉపయోగపడాలనే ఆశయంతో తన గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. గాంధీజీ రచనలు, కార్ల్ మార్క్స్ పుస్తకాలు, అంబేద్కర్ గ్రంథాలు, తమిళ నేతలు పెరియార్, అన్నాదురై తదితరుల రచనలు
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అయిదు వందల సినిమాల కథలు, పాటల పుస్తకాలను ఇక్కడ చూడవచ్చు. చదువుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోరులో పుస్తకాలను భధ్రపరచిన ఈయన పై అంతస్తులో సాహిత్య సమావేశాల నిర్వహిస్తుంటారు. అంతేకాదు, పరిశోధనలు చేసే విద్యార్థులు అక్కడే ఉండి తమ అధ్యయనం కొనసాగించే వీలు కల్పించారు. ఆయనే ఒకప్పుడు వల్లువం అనే పత్రికను ప్రారంభించి 24 సంచికలు వెలువరించి ఆ తర్వాత నడపలేకపోయారు. పత్రిక ఆగిపోయినప్పటికీ పుస్తకాలయం మాత్రం కొనసాగిస్తున్నారు. ఆయన సేవను గుర్తించి కొందరు తమ వంతు సహారసహకారా లందించారు. 


కామెంట్‌లు