"అలా ఆలోచించు";-- జగదీశ్ యామిజాల
 ఆ ఆశ్రమంలో ఓ శిష్యుడు మౌనంగా ధ్యానం చేసుకుంటున్నాడు. అది రాత్రి వేళ కావడంతో కప్పల బెకబెకలు, పురుగుల కీచ్ కీచ్ లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ అరుపులను శిష్యుడు భరించలేకపోయాడు. అతను ధ్యానం చేయడం మానేసాడు. తన ధ్యానానికి ఆటంకం కలిగిస్తోందని సహనం కోల్పోయాడు. తన ఏకాగ్రత అంతా చెదరిపోయిందని లోలోపల కుమిలిపోయాడు. ఏంటీ తలనొప్పి అనుకున్నాడు. ఇవేవీ అరవకుండా ఉండలేవా అని గురువుగారిని అడిగాడా శిష్యుడు.
అప్పుడా గురువు "అవి ఎందుకలా అరుస్తున్నాయని బాధపడుతున్నావు. తలనొప్పని అనుకుంటున్నావు. వాటికి తెలిసిన భాషలో అవి దేవుడ్ని ప్రార్థిస్తున్నాయి. నువ్వలా అనుకోవచ్చు కదా? దేవుడు ఒక్కో ప్రాణికీ ఒక్కో భాష ఇచ్చాడు. దేవుడికందరూ ఒక్కటే. ఏ అరుపునైనా స్వీకరిస్తాడు. వాటి అరుపులు ఇష్టమనే దేవుడు వాటితో అలా అరిపిస్తున్నాడేమో. నువ్వేమో ఆ అరుపులు నీకు ఇబ్బందిగా ఉన్నాయని,  విసుగు పుట్టించేలా ఉన్నాయనీ అంటున్నావు. ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించు" అన్నారు.
అప్పుడా శిష్యుడు ఆలోచనలో పడ్డాడు.

కామెంట్‌లు