సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 పరికరించు...పరిచరించు
  *****
ఏదైనా పని చేయాలన్నా ముందుగా మన మనస్సును, శరీరాన్ని పరికరించుకోవాలి. అలా సిద్ధపడకుండా చేసేవి ఏవైనా  మొక్కుబడిగా చేసినట్టే ఉంటాయి.వాటి ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి.
కాబట్టి తలపెట్టిన ఆశయం నిర్విఘ్నంగా నెరవేర్చుకునేందుకు మనల్ని మనం ఓ పరికరంలా మలుచుకుని పరికరించుకోవడం తప్పని సరి.
పరికరించు అంటే చాలానే అర్థాలు ఉన్నాయి.సిద్ధపడు, సన్నద్ధమగు,ఒగ్గు, ఓర్పు,నడుముకొను,సమకొను,పనుపడు,పంచారించు,జతనుపడు,సన్నాహమగు... మొదలైనవి.
ఏ మంచి పని చేయడానికైనా,నేర్చుకోవడానికైనా మనల్ని మనం పరికరించుట ఎంత ముఖ్యమో ,  చేసే ఆ పనిని దైవంగా భావించి మనశ్శరీరాలతో పరిచరించుట కూడా అంతే ముఖ్యం.పరిచరించుటలో ఏకాగ్రత,తపన అంతర్లీనంగా దాగి ఉంటాయి.
ఇంతకూ పరిచరించుట అంటే ఏమిటో చూద్దాం.పరిచరించుట అంటే పూజించు,అభ్యర్ఛించు, అర్చన చేయు,ఆరాధించు,ఉపాసించు,కొలుచు,అర్చించు, నోము,యజించు,కైసేయు లాంటి అర్థాలు ఉన్నాయి.
శ్రమైక జీవన సౌందర్యపు విలువ తెలిసి మనశ్శరీరాలను పరికరించుదాం.తపోనిష్ఠతో ఆ శ్రమను పరిచరించుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు