సుప్రభాత కవిత ; -బృంద
నిరీక్షణ భరించలేనిదైనా
మధురమైనది.
ఎదురు చూసే సమయంలో
వచ్చే ఉద్వేగం  అమూల్యమైంది.

ఎదురుచూసిన క్షణం
ఎదుటే నిలిచినా
ఎదురుచూపుల క్షణాల
ఎనలేని ఆనందం అద్వితీయం.

విరిసీ విరియని మందారాలు
పూర్తిగా విచ్చిన  మల్లెలూ
ముకుళించిన కల్హారాలు
అరవిరిసిన కమలాలు

అన్నిటిదీ నిరీక్షణే!
మనసంతా ఆరాటమే!
కనిపించని కోలాహలం
దాచలేని అసహనమే!

సుదూర తీరాన సూర్యబింబం
ముందే తాకిన అరుణకిరణం
ముద్ద మందారంలా
ఎర్రగ మారిన ఆకాశం

సింధూర వర్ణపు చీర కట్టి
జలతారు మెరుపుల రంగవల్లులు తీర్చే మేఘమాలల 
సంబరంతో మెరిసే అంబరం

భువనాలు గగనాలు 
రవళించె నవరాగాలు
మందార మకరంద
రసరాగ ఝరులు

సూర్యోదయానికి ముందు
నింగి ముంగిటి  అందాలు
వేసవిలో వసంతాలు
శరత్తులో వెన్నెలలు

ఎదురుచూసిన ఉదయపు
అపురూప క్షణాలకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు