సోషల్ మీడియా ప్రభావం; -సి.హెచ్.ప్రతాప్
 అంతర్జాలం సాంఘిక మాధ్యమాలనేవి ఓ వ్యసనంగా మారిపోయాయి. ఒక్కప్పుడు సాటి  మనుష్యులతో ముడిపడిన మన జీవితాలు ఇప్పుడు సాంఘీక మాధ్యమాలతో వీటితోనే ముడిపడినట్టుగా అనిపిస్తుంది. గతంలో ఉదయం లేవగానే దేవుని బొమ్మ చూసేవారు ఇప్పుడు వాట్సప్‌లు చూస్తున్నారు. సాంఘిక మాధ్యమాల వల్ల ఉపయోగాలు చాలా ఉన్నప్పటికీ, చాలామంది విలువైన కాలాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారన్నది కఠోర సత్యం.కుటుంబ సభ్యులతో కలిసి గడిపే కాలం ఇప్పుడు అంతర్జాలం, సాంఘిక మాధ్యమాలతో గడుపుతూ మానవ సంబంధాలను దూరం చేసుకుంటున్నారు. వ్యక్తిగత ఫోటోలు, ఉత్తరాలు అన్నీ పబ్లిక్ అయిపోయాయి. ఒకటి రెండు ఫోటోలు కాదు. వందల ఫోటోలు అన్నీ కూడా సత్వరమే ప్రపంచ యాత్ర చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఏ ఫొటోలు పెట్టవచ్చో, ఏ ఫొటోలు పెట్టకూడదోనన్న వివేచన కూడా లోపిస్తోందంటే అతిశయోక్తి కాదు.
సామాన్యంగా, సోషల్ మీడియా ప్రజలకు కమ్యూనికేట్ చేయడానికి, వారి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడానికి, వారితో పరస్పర చర్చలు, సంబంధాలు కొనసాగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఉద్యమాలు మొదలుకొని.. ఊసుపోని సరదా కబుర్లు వరకు సోషల్ మీడియా అనేది చక్కని ఫ్లాట్‌ఫాం. అదే సమయంలో చక్కగా ఉపయోగించుకుంటే ఒక చక్కని గురువువలే తోడూనీడగా ఉండి జ్ఞానబోధ కూడా చేస్తుంది. అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎంతలా ఉపయోగించుకోవాలి అనేది యువతకు తెలియకపోవడమే అసలు సమస్య.
ఇది ఒక సాలెగూడు అంతకు మించి విష వలయం ఒక్కసారి అందులోకి వెళ్ళామా తిరిగి బయటకు రాలేము. ఇందులో దొరికే అశ్లీలతకు కొందరు యువతీ యువకులు చిక్కుకొని తమ విలువైన భావి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని తాజా అధ్యయనంలో తేలింది. సిగరెట్, ఆల్కహాల్‌తో పోలిస్తే సోషల్ మీడియా అడిక్షన్ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలిసింది. అందుకే సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే యువత తమను తాము ఓసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు ఎక్కువవుతున్నాయి. సమాజంలో హింసను పెంచుతున్నాయి. బంధాలు దెబ్బతింటున్నాయి.
ఈ ఆధునిక యుగంలో నాగరికత త్వరత్వరగా మారిపోతుంది. మనుషుల నడవడిక, స్వభావాలు కూడా మారిపోతున్నాయి.
తమని తాము ప్రమోట్ చేసుకోవడానికి ఈ ఆధునిక సాంఘిక మాధ్యమాలు బాగా ఉపయోగపడుతున్నాయి. అంతవరకు పర్వాలేదు. కానీ వ్యక్తిగత జీవితం లేకుండా చేసుకోవడం ఎంతవరకు సమంజసమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.ఏది ఏమైనా సాంకేతిక విప్లవం వలన మానవ సంబంధాలను, కుటుంబ సంబంధ బాంధవ్యాలను దూరం చేసుకోవడం క్షమార్హం కాదు.
మాచార మాధ్యమాలు ప్రజల పురోగతికి తోడ్పడే సాధనాలుగా ఉండా లి. శాస్త్రీయమైన, సత్య నిబద్ధతలతో కూడిన, నిర్మాణాత్మక ప్రజాభిప్రాయాన్ని నిర్మించే విధంగా పెంపొందించాలి. సమాజంలోని అనేక అంశాల్లో పాటిస్తున్న అనైతిక విలువ ప్రభావం మాధ్యమాలపై కూడా పడుతున్నదని గమనించాలి. సోషల్ మీడియా మన జీవిత ప్రమాణాలు, ఆలోచనలు, సంస్కృతి, సాహిత్యాలపై తీవ్రమైన ప్రభావాలను కలిగించి.. మన రాజకీయ, సామాజిక దిశ, దశలను మార్చి వేస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల మానవులు ప్రపంచాన్ని చూసే కోణమే మారిపోయింది. ప్రజాచైతన్యమే సోషల్ మీడియా అక్రమాలకు విరుగుడు. మంచిని ప్రోత్సహించాలి.

కామెంట్‌లు