భీమ శoకర జ్యోతిర్లింగ క్షేత్రం -- సి.హెచ్.ప్రతాప్ ( చరవాణి: 95508 51075 )
 మన దేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం సృష్టిని నడిపించువాడు శివుడు అని విశ్వసిస్తారు. అంత మహిమ గలవాడు కనుక అడుగడుగునా మన దేశంలో శైవ క్షేత్రాలు ఎన్నో వెలిశాయి. వాటిలో ప్రసిద్ధమైనవి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత ఉంది. వాటిలో ఒకటి భీమ శoకర జ్యోతిర్లింగ క్షేత్రం.
మహారాష్ట్రలో పూణే కి 127 కి.మీ దూరం లో ఖేడ్ తాలుకాలో భీమా నది పక్కన భావగిరి గ్రామంలో భీమశంకర జ్యోతిర్లింగం ఉంది. భీముడు అనే రాక్షసుడు వల్ల తలెత్తిన విపత్తును తొలగించినందు వల్ల ఇక్కడ శంకరుడుకి భీమ శంకరుడు అని పేరు వచ్చింది. సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది. కృష్ణా నదికి ఉపనది అయిన భీమా నది పుట్టిన చోటు శివలింగం పక్కన ప్రవహిస్తుంది. భీమ శంకరుడు ని శాకిని, డాకిని అనే రాక్షసులు పూజిస్తారని పురాణ కథనం. ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దం లో నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి.
భీమశంకర్ ఆలయాన్ని సందర్శిస్తే భూత, ప్రేత, పిశాచాల పీడలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. దానిక్కారణం భీమశంకర్ ఆలయం ఏర్పడింది భీమాసురుడనే రాక్షసుడి పేరు మీద. అతడు కుంభకర్ణుడు, కర్కటి అనే రాక్షసికి జన్మించినవాడు. రాముడు రావణుడు, కుంభకర్ణుడిని సంహరించాక కర్కటి ఇలా సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో తలదాచుకుని శివభక్తురాలిగా మారిపోతుంది.
భీమాసురుడు విష్ణుభక్తులను, రుషులను లేకుండా చేసేందుకు బ్రహ్మకోసం తపస్సు చేసి వరాలు పొందుతాడు. ఇంద్రుడిని కూడా జయించి బంధిస్తాడు. ప్రస్తుతం భీమశంకర ఆలయం ఉన్న ప్రాంతాన్ని పూర్వం సుదక్షుణుడనే రాజు పాలించేవాడు. అతను పరమ శివభక్తుడు. అతడిని కూడా ఓడించి, కారాగారంలో బంధిస్తాడు భీమాసురుడు. అంతేకాదు శివుణ్ని కాకుండా తననే పూజించమని చిత్రహింసలు పెడతాడు. తన కత్తితో సుదక్షణుడు తయారుచేసి శివలింగాన్ని ఖండించబోతాడు. అందుకే అక్కడి శివలింగంపై ఇప్పటికీ కత్తిగాటు కనిపిస్తుంది. భీమాసురుడి చర్యకు కోపోద్రిక్తుడైన లయకారుడు ప్రత్యక్షమై భీమాసురుడిని అంతమొందిస్తాడు.
అతడి తల్లి కర్కటి కోరిక మేరకు భీమాసురుడికి మోక్షం ప్రసాదించి, భీమాశంకరుడిగా ఆ కొండపై వెలిశాడని అంటారు. అందుకే డాకిని, శాకిని వంటి ప్రేత పిశాచాలు అక్కడ శివుడిని పూజిస్తాయని చెబుతారు. శివుడు యుద్ధం చేస్తున్నప్పుడు కారిన చెమట బిందువులతోనే అక్కడ భీమా నది ఏర్పడిందని అంటారు. కృష్ణా నది ఉపనదే భీమా నది.

సి హెచ్ ప్రతాప్ 



కామెంట్‌లు