*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 007*
 కందం:
*ఉన్నను లేకున్నను పై*
*కెన్నడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ*
*కన్నతల్లిదండ్రుల యశం*
*బెన్నఁబడెడు మాడ్కిఁదిరుగు మెలమిఁగుమారా !*
తా:
కుమారా! నీకు డబ్బులు ఉన్నా, లేకపోయినా, నీ ఇంటి రహస్యాలను బయటివారికి చెప్పకుండా, నును కన్న నీ తల్లిదండ్రుల కీర్తి, పేరు ప్రతిష్ఠలు పెరిగే విధంగా నడుచుకో.... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మన పెద్దలు "విభీషణుని లాగా ఇంటి గుట్టు బట్టబయలు చేయకురా" అని అనడం మనం చాలా సార్లు విన్నాము. ఇక్కడ విభీషణుడు, రావణ బ్రహ్మ మరణ రహస్యం రాములవారికి చెప్పి లోక కళ్యాణం జరగడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, జరిగింది మాత్రం తన కుటుంబానికి నష్టమే. మనం, మన స్వలాభం కోసం ఇంటి గుట్టు పదిమందికి చెప్పడం వల్ల అనర్ధం జరుగుతుంది. ప్రతి ఇంటిలోనూ, చిన్న చితకా అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవి ఇంటి గడప లోపలే ఉండాలి. ఇంటి పెద్ద సాయంతో, పరిష్కారం కనుక్కోవాలి. అంతే కానీ, వీధికి ఎక్కకూడదు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మనందరికీ ఆ పరాత్పరుడు అనుగ్రహించాలని వేడుకుంటూ......... అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు