*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 011*
 కందం:
*నరవరుడు నమ్మి తను నౌ*
*కరిలో నుంచునెడ వాని కార్యములందున్*
*సరిగా మెలంగ నేర్చిన*
*పురుషుడు లోకమున ఁగీర్తిఁ బొందుఁగుమారా !*
తా:
కుమారా! ఈ నేల మీద రాజు గారు గానీ, ఒక కార్యాలయంలో అధికారి గానీ, ఒక వ్యక్తిని నమ్మి ఒక పని పూర్తి చేయమని అతనికి అప్పచెప్పి నప్పుడు, ఆ సదరు వ్యక్తి తనకు ఇవ్వబడిన బాధ్యతలను చక్కగా చేసినవారు ఈ లోకములో మంచి పేరు సంపాదించుకుంటారు...... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*కర్తవ్య నిబద్ధత, కార్య దక్షత తో ఇచ్చిన పనిని పూర్తి చేసిన మనిషికి సమాజంలో గొప్ప గుర్తింపు వస్తుంది అనడంలో సందేహం ఏమాత్రమూ లేదు. దీనికి చక్కని ఉదాహరణగా మనం హనుమ చేసిన సీతాన్వేషణని చెప్పుకోవచ్చు. హనుమ కార్యనిబద్ధత ఎంత ఉత్కృష్టమైనది అంటే, సీతమ్మను వెదికి వచ్చేస్తే, ప్రత్యేకత ఏమీలేదు. రావణుని సైన్యశక్తిని అంచనా వేసి, కొంత సైన్యాన్ని నాశనం చేసి వచ్చాడు, హనుమ. రామ కార్యము సఫలం అవడానికి తనవంతు కృషి చేశాడు. కనుక ఇవ్వబడిన పని పూర్తి చేయడం కాక, రెండు అకులు ఎక్కువ చదివి ఆ పని తరువాత జరగవలసిన పనికి కూడా పనికి వచ్చే విధంగా పనిచేసే వారు, కచ్చితంగా చాలా గొప్ప పేరు సంపాదించు కుంటారు. అలా మనకు ఇచ్చిన పనిని వక్కని, చిక్కనైన తెలివితేటలతో చేయగల సామర్థ్యం మనకందరకు పరమాత్ముడు ఇవ్వాలని, ఇస్తారని ఆశిస్తూ......... అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు