*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 016*
 కందం:
*ఆచార్యున కెదిరింపకు*
*బ్రోచిన దొరనింద సేయఁబోకుము కార్యా*
*లోచనము లొందఁ జేయకు*
*మాచారము విడవఁ బోకుమయ్య! కుమారా !*
తా:
కుమారా! గురువు చెప్పిన మాటకు ఎదురు చెప్పకు. నిన్ను పోషించే వారిని నిందింపకు. ఒకపని గురించి పది పది విధాలుగా ఆలోచించకు. ఇంటి ఆచారము, పెద్దలు చూపిన దారిని విడిచి పెట్టెకు....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*శిశుపాలుడు బ్రతికి బట్ట కట్టడానికి కారణ హేతువు, శ్రీకృష్ణ పరమాత్మ. కానీ, కృష్ణ నింద చేస్తూనే ఉంటాడు, శిశుపాలుడు. చివరకు ఆ పరమాత్మ వదలిన సుదర్శన చక్రానికి బలి అయ్యాడు. మనం ఈ రోజు సమాయానికి భోజనం చేస్తూ, అవసరమైన బట్టలు వేసుకుంటూ ఉన్నాము అంటే, దానికి కారణం, మనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు అనబడే వారు, ఎవరికైనా దైవం తో సమానం అవుతారు. ఎందుకంటే, ఈ తల్లిదండ్రులు, తమ అవసరాలు, స్వార్ధాన్ని పక్కన బెట్టి, తమ పిల్లల బాగు కోసం నిరంతరం పాటు పడుతుంటారు. ఈ రోజు, మన చుట్టూ సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు, తమ అవసాన దశలో పిల్లల అనాదరణకు గురి అయ్యి, వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. ఇది సమాజానికి మంచి చేయదు. అందువల్ల, మన తల్లిదండ్రుల యెడ మన బాధ్యత సక్రమంగా నిర్వహించే మంచి బుద్ధుని మన అందరికీ ఇవ్వమని............ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు