*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 018*
 కందం:
*కల్లలగు మాట లాడకు*
*మెల్లజనంబులకు వేగ హృదయము కడు రం*
*జిల్లగఁ బల్కుము నీ కది*
*తెల్లము రహిఁగీ ర్తిఁగాంచు దెరగు కుమారా !*
తా:
కుమారా! కల్లబొల్లి మాటలు, అబద్ధాలు మాట్లాడకు. ప్రజలందరికీ మనసులకూ ఆనందము కలిగించే విధంగా నిజము మాట్లారితే, అది నీకు ఆనందాన్ని, మంచి పేరును సంపాదించి పెడుతుంది....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*అబద్ధాలు ఆడకుండా వుండడం. కష్టమైన, ఇష్టంగా సత్యం/నిజాన్ని మాత్రమే మాట్లాడటం. ఈ రెండు అంశాలను మనకు పరిచయం చేయడానికి, కొత్తగా పరిచయం అవసరం లేని రెండు పాత్రలు, హరిశ్చంద్రుడు మరియు ధర్మరాజు. వీరిద్దరూ కూడా సత్యం పలకడం వల్ల వచ్చిన అనేక కష్టాలను అనుభవిస్తూ కూడా సత్యాన్ని, సత్యాన్ని మాత్రమే మాట్లాడుతూ జీవితం గడిపారు. అనన్య సామాన్యమైన కీర్తి ప్రతిష్టలు గడించారు. అంతిమంగా, భగవంతుడి అనుగ్రహం కూడా పొంది, మోక్షాన్ని పొందగలిగారు. మనం ధర్మరాజు, హరిశ్చద్రులము కాలేక పోయినా, మనకు కష్టం, నష్టం రానంత వరకైనా, ఎదుటి వారి జీవన గమనాన్ని అడ్డుకోకుండా వున్నంత వరకైనా, సత్యం మాట్లాడ గలిగితే ధన్యజీవులమే. ఇంతకు మించి చేయ గలిగితే, చక్రపొంగలి తిన్నప్పుడు కలిగే మధురానుభూతి మనది అవుతుంది. సమాజం గౌరవిస్తుంది కూడా. అంతటి అదృష్టాన్ని మనకు కలిగించాలని............ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు