*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0197)*
 *"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివుని ఆరాధనలో పార్వతి దుష్కరమైన తపస్సు.*
*నారదా! శంభుని యందు తన మనసు లగ్నము చేసి గౌరీ శిఖరముగా పిలువబడే శృంగతీర్ధములో పార్వతి తుపానులను, సహింపరాని ఎండలను, ఎముకలు కొరికే చలిని, రకరకాల ఇబ్బందులను, అవలీలగా జయించి తన తపస్సు కొనసాగిస్తూనే ఉంది. ఒక సంవత్సరం ఫలహారాలతో గడిపింది. ఇంకొక సంవత్సరం కేవలం నీరు త్రాగి గడిపింది. వేరొక సంవత్సరం ఆకులను తిని గడిపింది. ఇక తరువాత, ఆకులు కూడా తినకుండా ఉండి పోయి, "అపర్ణ" గా పిలువబడింది. రుద్రుని స్మరిస్తూ ఒంటికాలి తపము చేసింది. జటలు ఏర్పడ్డాయి. ఈ విధంగా పార్వతి చేస్తున్న తపము, మౌనులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మూడువేల సంవత్సరాల కాలం గడిచి పోయింది.*
*ఈ విధంగా తపస్సు చేస్తున్న పార్వతి ఒక రోజు, "నేను రుషభధ్వజుని కోసం తపస్సు చేస్తున్నాను అని సర్వేశ్వరుడు అయిన శివునకు తెలియదా! ఇంత వరకు ఆ నా స్వామి నా వద్దకు ఎందుకు రావటం లేదు. భగవంతుడు అయిన శంకరుడు శుభములను ఇచ్చేవాడు. సర్వజ్ఞుడు, సర్వాత్మ, సర్వదర్శి, సకలైశ్వర్య ప్రదాత, అందరి మనోభావములు తెలుసుకో గల వాడు. అన్ని కష్టాలు తొలగించే వాడు. నేను ప్రాపంచిక కోరికలకు ఆకర్షితురాలను అవకుండా, కేవలం నారదుడు ఉపదేశించిన పంచాక్షరీ మంత్రమును జపిస్తూ ఉంటే, శుభ కారకుడు అయిన శంభుడు నా యందు ప్రసన్నుడు అగుగాక" అనుకుని తన తపము కొనసాగించింది.*
*పార్వతీ దేవి తపః ప్రభావము వలన, ఆమె కూర్చున్న తపో భూమిలో, ఒకరికి ఒకరు బద్ధ శత్రువులుగా ఉండే, సింహము, ఆవు; పిల్లి, ఎలుక; కోతి, కుక్క; పాము, ముంగిస మొదలైన జంతువులు అన్నీ కూడా ఎంతో స్నేహ భావముతో కలసి మెలసి సహ జీవనం చేస్తున్నాయి. ఆరు రుతువులు కాలానుగుణంగా తమ ప్రభావం చక్కగా చూపుతున్నాయి. ఆ తపోవనం లో ఉన్న ఫల వృక్షాలు అన్నికాలాలలో పూలు, పళ్ళను అందిస్తున్నాయి, పార్వతి చేసే శివ పూజకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా. ఆ పన్నగభూషణుని కొరకు జటావల్క ధారిణియై కాళి చేస్తున్న తపస్సు కొనసాగుతోంది.*
 
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు