*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0204)*
 *"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ సకల శుభాలు, పరమాత్మ తో దగ్గర తనం కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివుడు బ్రాహ్మణ రూపంలో పార్వతిని కలవడం - ఆమెతో తపస్సు కారణం అడగటం - విజయ, పార్వతి సఖి అంతా వువరించుట*
*నారదా! "విప్రోత్తమా! మీరు బయలు దేరండి. నేను అగ్ని ప్రవేశం చేయాలి" అని చెప్తూనే, ఆ వృద్ధ బ్రాహ్మణ రూపధారి వారిస్తున్నా కూడా వినకుండా అగ్ని ప్రవేశం చేసింది పార్వతి.  కానీ, కాళి చేసిన తపస్సు ఫలితంగా అగ్ని భట్టారకుడు పార్వతి శరీరమును దహించకుండా, ఉచిత రీతిని అంబను గౌరవించి, తాను నిష్క్రమించాడు. అప్పుడు, అక్కడే ఉన్న విప్రుడు, "భద్రురాలా! నీవు ఏమి తపము చేస్తున్నావో నాకు తెలియటల్లేదు. అగ్ని తో కూడా నీ శరీరం శుద్ధి అయి వచ్చావు. కానీ, నీ గాఢమైన కోరిక తీరలేదు. అందువల్ల నీ తపము విఫలము అయినది అని తెలుస్తోంది. నేను, అందరి మేలు కోరే వాడిని. అందరి మనసులు తెలిసిన వాడను. అందరికీ ఆనందమే దక్కాలని కోరుకునే వాడిని. కనుక, నీ అభీష్టము ఏమిటో నిస్సందేహంగా నాకు చెప్పు. అది నెరవేర్చే ప్రయత్నం చేస్తాను" అన్నారు.*
*అప్పుడు, తన వృత్తాంతం అంతా బ్రాహ్మణునకు చెప్పమని, తన సఖి విజయకు సూచిస్తుంది, పార్వతి. విజయ, విప్రదేవునితో ఇలా చెప్పింది. "ఈమె, గిరిరాజు హిమవంతుడు, మేనకల కూతురు. ఈమెకు ఇప్పటి వరకు వివాహం అవలేదు. ఈమె, పార్వతి, కాళి అని కూడా పిలువబడుతుంది. మా కాళి, ఎప్పటికైనా భగవంతుడు అయిన ఆ శంకరునే భర్తగా పొందాలని గడచిన మూడు వేల సంవత్సరాల నుండి కఠోర నియమాలు పాటించి తపము చేస్తోంది. మా పర్వత రాజకుమారి, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలు గా గల దేవతలను అందరినీ కాదని, కేవలము పరాత్పరుడు అయిన శంభుని మాత్రమే తన భర్తగా అంగీకరించింది. ఇది మా పార్వతి మనోరథము. మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలా" అని విప్రదేవునితో అన్నది విజయ, పార్వతి ఇష్ట సఖి.*
*ఈ మాటలను విన్న బ్రాహ్మణ వేషధారి, ఫక్కున ఒక్కసారి పెద్దగా నవ్వి, "నీవు చెప్పినదంతా నిజమే అయితే, ఆమాట పార్వతి తన నోటి తోనే చెప్పవచ్చు కదా, నీవు చెప్పడము ఎందుకు" అన్నారు. అప్పుడు, కాళి ఇలా చెప్పడం మొదలు పెట్టింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు