*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0209)*
 *"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ సకల శుభాలు, పరమాత్మ తో దగ్గర తనం కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*ఇంటికి తిరిగి వచ్చిన పార్వతికి సత్కారం - మహాదేవుని నట లీల - పార్వతి ని యాచించడం - తిరస్కారం - అంతర్ధానం*
*నారదా! తమ కుమార్తె ను భార్యగా ఇవ్వమని అడిగిన నాట్యకారుని కోరిక తీర్చడము కుదరదు అని చెప్పిన హిమవంతునికి, శంభుడు తన లీలా రూప దర్శనం ఇవ్వాలని నిర్ణయించారు. అగ్ని లాగా ఉత్తమ తేజస్సుతో ప్రకాశిస్తున్న నటరాజుగా, భిక్షువు గా వచ్చిన ఈశానుడు, రెప్పపాటు కాలములో భగవానుడైన విష్ణుమూర్తి రూపంలో కనిపించారు. తలపై కిరీటము, చెవులకు బంగారు కుండలాలు, మెడలో తులసి మాలలు, ఒంటిపై పట్టు వస్త్రాలు ధరించి, నాలుగు భుజాలలో, శంఖు, చక్ర, గదా పద్మాలు ధరించి వున్నారు. తన ఎదుట అలా కనబడ్డ విష్ణుమూర్తి కి పూవులు సమర్పించాడు, హిమవంతుడు. ఆ పూలు అన్నీ నటరాజు తలపైనా పాదాలపైన ఉన్నాయి. తరువాత హిమవంతునకు, నటరాజు ఎర్రని శరీరము తో, వైదిక మంత్రాలు చదువుతున్న పరబ్రహ్మ రూపంలో కనిపించారు. ఆ తరువాత, జగత్తు కు వెలుగును ఇచ్చే సూర్యనారాయణమూర్తి గా కనిపించారు, నటరాజు. చువరగా రుద్రదేవునిగా కూడా కనిపించారు. చిట్టచివరి గా స్వామి, కేవలం ఒక తేజో జ్యోతిర్మయ రూపంలో, నిరాధారంగా, నిరంజనముగా, నిరీహంగా హిమవంతుని కి కనిపించారు. స్వామి ఆ తేజో రూపంలో ఎంతో అద్భుతంగా ఉన్నారు. ఇలా హిమవంతుడు నటరాజు యొక్క అనేక రూపములను క్షణ కాలంలో  చూసాడు.*
*అప్పుడు యాచకుడుగా వచ్చిన రుద్రుడు మేనకా హిమవంతులతో, పార్వతిని భిక్ష రూపంలో తనకు ఇవ్వమని అడిగారు. కానీ, శైల రాజు, శివ మాయామోహంలో ఉండి పరమేశ్వర ప్రార్థన అంగీకరిచలేదు. దానికి మారుగా మణి మాణిక్యాలు, మడి మాణ్యాలు, అనంత సైనిక సంపద, తన రాజ్యము కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, హిమవంతుడు. కానీ, తనకు అంబ తప్ప వేరిదీ భిక్షగా అంగీకారం కాదు అని శంభుడు అదృశ్యం అయిపోయారు.*
*కావలసిన కార్యం అయితే గానీ, మేనకా హిమవంతులకు తత్వం బోధపడలేదు. ఇంత సేపు తమ ఎదురుగా ఉండి, పాటలు పాడి, అనేక రీతులలో నృత్యం చేస్తూ, అన్ని దేవతా రూపాలను తనలో చూపించిన వాడు, శివుడు అనే జ్ఞానం కలిగింది. కానీ, అప్పటికే సద్యోజాతుడు కైలాసం చేరి ధ్యానం లోకి వెళ్ళి పోయారు. ఇప్పుడు, ఇంత జరిగాక, కాళి తల్లిదండ్రుల కు గాఢమైన పరమేశ్వర భక్తి ఏర్పడింది.*
 
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు