*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0214)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*హిమవంతుడు శివునికి లగ్న పత్రిక పంపడం - మంగళాచారములు - పర్వతలులు, నదులు దివ్య రూపమలో రావడం - కళ్యాణం కోసం విశ్వకర్మ దివ్య మండపం నిర్మాణం*
*నారదా! పార్వతి వివాహం శంభునితో జరిపించడానికి హిమవంతుని సమ్మతి తెలుసుకున్న సప్త ఋషులు కైలాసానికి వెళ్ళి రుద్రుని కి విషయం తెలియజేసి తమ నెలవులకు వెళ్ళిన తరువాత, ఇక్కడ హిమవంతుడు తన పురోహితుడు అయిన గర్గునితో లగ్న పత్రిక వ్రాయించాడు. హిమవంతుని బంధు జనులు ఆ లగ్న పత్రికను తీసుకుని కైలాసానికి వెళ్ళి శంకరునికి ఉచిత మర్యాదలు చేసి, లగ్న పత్రికను అందచేసి వివాహానికి తరలి రమ్మని ప్రార్థించారు. శివదేవుడు కూడా తన వద్దకు వచ్చిన వారందరినీ వారి వారి అర్హతను అనుసరించి సత్కారము చేసి వివాహ మంటపానికి రావడానికి తమ సమ్మతి తెలియజేసారు.*
*ఇక్కడ హిమత్పురము, వివాహ ఆహ్వనము అందుకుని వచ్చిన బంధు మిత్రులతో కిటకిట లాడి పోతోంది. మందరాచలము, అస్తాచలము, మహేంద్ర, పారియాత్ర, క్రౌంచ, పురుషోత్తమ శైలము మొదలుగా గల పర్వతాలు, గోదావరి నదితో కలిసి, గంగ, యమున, సరస్వతి, వేణి, నర్మదా మొదలైన ఉత్తమ నదులు అన్నీ కూడా దివ్య రూపాలు ధరించి శివాశివుల వివాహం చూడడానికి తరలి వచ్చారు. వీరు ఉండడానికి వేసిన గుడారల వెనుక దాగున్నాడు, ప్రచండ శక్తి సంపన్నుడైన సూర్యనారాయణుడు. హిమాలయ దివ్య నగరము మొత్తం అనేక ధ్వజములు, పతాకములు, బంగారు తోరణములతో నిండిపోయింది. ఆ నగరం అంతా ఫల, పుష్ప వృక్షాలతో అలంకరింప బడింది.*
*పురోహితుడైన గర్గుడు హిమవంతుని చేత పార్వతి కి చేయవలసిన మంగళ కార్యములు అన్నీ దగ్గర ఉండి, వైదిక విదితంగా జరిపిస్తున్నాడు. హిమవంతుడు, విశ్వకర్మను పిలిచి, వివాహ వేదికను, దేవతా సమూహానికి అనువైన విధంగా భవన సముదాయం ను తయారు చేయమన్నాడు. వారి వారి అర్హతలకు అనుగుణంగా విశ్వకర్మ వివిధరకాల భవనాలను దేవతల కోసం నిర్మించాడు. పెండ్లికొడుకు కోసం ఆహ్లాదకరమైన విడిది తయారు చేసాడు విశ్వకర్మ. ఆ విడిది, అన్ని విధాలా పరమేశ్వరుని కైలాసాన్ని తలపిస్తోంది. పెండ్లి మంటపంలో విష్ణువు, ఇంద్రుడు, సకలదేవతల విగ్రహాలు, బ్రహ్మ నైన నా విగ్రహం తో సహా ఏర్పాటు చేసాడు. కానీ, అవి విగ్రహాలు లాగా కాక మూర్తీభవించిన దేవతా మూర్తుల లాగేనే ఉన్నాయి. ఈ విధంగా ఆ పెళ్ళి మంటపం, అనేక ఆశ్చర్య కర విషయాలతో నిండి, దేవతలను కూడా ఆశ్చర్య చకితులను చేస్తోంది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు