పలకా బలపం;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఏంటి పలకా బలపం పేరు చెప్పగానే చిన్నతనం  గుర్తొచ్చేసిందా? నాక్కూడా...! మీకో విషయం చెప్పనా నాకు స్లేట్ పెన్సిల్స్ అంటే చాలా ఇష్టం. ఎవరికీ తెలియకుండా చాటుగా స్లేట్ పెన్సిల్స్ ని తినేసేదాన్ని. అలా తింటూ తింటూ చాలాసార్లు దొరికిపోయాను కూడా తర్వాత అమ్మ చివాట్లు, మొట్టికాయలు..... హా హా
ఛీ ఛీ స్లేట్ పెన్సిల్స్ ని తినేదానివా అంటూ పెద్దరికంగా చివాట్లు పెట్టకండేం..! ఈ ఆర్టికల్  చదివే చాలా మందికి నా అలవాటే ఉండొచ్చు ఎందుకంటే స్లేట్ పెన్సిల్స్ స్మెల్ అలా ఉంటుంది మరి.... ఏం కాదంటారా?.... సరే సరి.
అసలు విషయం ఏంటంటే...
నేను స్కూల్ కి వెళ్లేటప్పుడు
అమ్మ నాకు రెండు స్లేట్ పెన్సిల్స్ ఇచ్చి పంపించేది. ఇంటికి తిరిగి ఏమీ తెచ్చేదాన్ని కాదు
రాసేశానమ్మ స్లేట్ పెన్సిల్స్ అన్నీ అయిపోయాయి అని ఒకసారి, నా స్లేట్ పెన్సిల్ ఎవరో తీసేసుకున్నారు అని ఇంకోసారి ఇలా రోజుకొక కొత్త కథ చెప్తూ ఉండేదాన్ని. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ ఈ రోజు ఏం నేర్చుకున్నావో చెప్పు అంటూ నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆరాలు తీసేది. స్కూల్లో టీచర్ పలకపై గడులను కొట్టి ఇచ్చేది కనుక ఆ గడిలోనే అక్షరాలు రాయడం అలవాటు. అమ్మా ఇలా కొట్టివ్వు అని నేను సైగలతో చెప్తే అమ్మ పలకపై గడులను కొట్టిచ్చేది. అప్పుడు నేను రాయడం మొదలు పెట్టేదాన్ని అన్నీ కరెక్ట్ గా రాసేసే దాన్ని అని అబద్ధమైతే చెప్పను కానీ చాలానే తప్పులు రాసేదాన్నండోయ్ నేను. నర్సరీ,ఎల్కేజీ, యూకేజీ,
వరకు పలకా బల్పంతోనే నా విద్యాభ్యాసమంతా. ఫస్ట్, సెకండ్ క్లాసుల్లో నోట్ బుక్స్ ఇచ్చినా మాథ్స్ టేబుల్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, వాటిని
స్లేట్లోనే రాసుకొని తీసుకు రమ్మని చెప్పేవారు మా ఉపాధ్యాయులు. దాంతో స్లేట్ పెన్సిల్ ని తడిపి రాసిన హోమ్ వర్క్ ఎక్కడ
చెదిరిపోతుందోనని దానిని దూరంగా జాగ్రత్తగా ఉంచేదాన్ని. ఉదయం స్కూల్ కి వెళ్లేటప్పుడు ఆ స్లేట్ అంచు జాగ్రతగా పట్టుకు పోయే దాన్ని. అయినా ఈ రోజు పిల్లలకు ఆ భాగ్యం ఎక్కడ ఉంది చెప్పండి చదువులన్నీ కాగితాలతోనే మొదలవుతున్నాయి. పిల్లలను స్కూల్లో జాయిన్ చేసీ చేయగానే స్టేషనరీ ఐటమ్స్ అని కొని తెచ్చి ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు.
దాంతో పెన్ను, పెన్సిల్ పట్టుకొని తెగ రాసేస్తుంటారు మన చిన్ని తండ్రులు. అయినా
గత తరం వరకు బాల్యంలో పలకా బలపం అనేది అందమైన జ్ఞాపకం మరి నేటి తరాలకు జ్ఞాపకాలు వుండాలంటే మళ్ళీ మా తరం ముందుకు రావాల్సిందే..!



కామెంట్‌లు