నిజాయితీ ఆయన చిరునామా ...; ప్రమోద్ ఆవంచ 7013272452
 జర్నలిస్టుగా పనిచేసేవాళ్ళందరూ కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతే,వాళ్ళను ఎందుకయ్యా ఈ ఫీల్డ్ కి వస్తున్నావు... ఇంకేదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా
అనీ నిరుత్సాహ పరుస్తుంటారు.కానీ వాళ్ళు మాత్రం ఏళ్ల తరబడి పనిచేస్తూనే ఉంటారు.కాలేజీ పూర్తయిన తరువాత రిపోర్టర్ గా జాయిన్ అయి, సమాజంలో ఉన్న కుళ్ళునంతా కడిగేయాలనీ,తాను,రాసే,వార్తల ద్వారా సమాజాన్ని బాగుపరచాలనీ,ఏదో సమాజం పట్ల తనకే బాధ్యత ఉందనీ, తాను రాసిన వార్త ఆ రోజు పేపర్లో వస్తే,ఆ వార్తకు స్పందించి, ప్రభుత్వ యంత్రాంగం
అంతా కదిలివస్తుందన్న, భ్రమలో ఉంటారు...లేత జర్నలిస్టులు..అంటే కొత్తగా జర్నలిస్టులుగా, జాయిన్ అయిన వారని అర్థం.నేను పొద్దు పేపర్లో పని చేసేటప్పుడు,అల్లం నారాయణ గారు వచ్చి చెప్పే వారు మనం, దీన్ని ఒక ఉద్యోగం లాగానే చేయాలి కానీ  సమాజాన్ని ఉద్దరిద్దామనీ కాదు,అనీ...
జర్నలిజం మీద ఇష్టం ఉండి,ఒక పేపర్ ఆఫీసులో చేరి, తాను రాసిన వార్త తన ఉద్యోగానికే ఎసరైన,క్షణంలో,సదరు పత్రిక ఎడిటర్, పిలిపించి, ఏదైనా వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదయ్యా!మాకే జీతాలు సరిగ్గా రావడం లేదు, అన్న సందర్భం.....కట్ చేస్తే
                   అందరి లాగే డిగ్రీ పట్టా చేత పట్టుకొని ఉద్యోగ వేటలో హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆ రిపోర్టర్ నెల్లుట్ల రాధామనోహర్ రావు.ఆ పత్రిక ఉదయం దిన పత్రిక,ఆ ఎడిటర్ పతంజలి గారు.ఆయన రాసిన వార్త 'ఆ మార్కెట్ లో పండ్లు మురిగిపోతున్నాయి'వార్త రాసిన కాలం 1987 వ సంవత్సరం.జాన్ బాగ్ నుంచి పండ్ల మార్కెట్ ను చైతన్యపురి మార్చాలనీ,అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఆదేశాలిచ్చారు.కానీ జాన్ బాగ్ లోని
 పండ్ల వ్యాపారులకు,అది ఇష్టం లేదు.చాలా రోజుల వరకు వాళ్ళు ఇక్కడికి రాలేదు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పండ్ల లారీలు చైతన్య పురి మార్కెట్ లో రోజుల తరబడి ఉండడం వల్ల పండ్లన్నీ మురిగిపోయాయి...ఇదీ విషయం దీన్ని అక్కడి ఉదయం దిన పత్రిక దిల్ సుఖ్ నగర్ స్ట్రింగర్ నెల్లుట్ల రాధామనోహర్ రావు ఉన్నది ఉన్నట్లుగా వార్త రాసారు.
 అదే ఆయనకు ఇబ్బంది తెచ్చి పెట్టింది.వార్త ప్రింట్ అయ్యింది.ఎదావిదిగా మరుసటి రోజు సాయంత్రం ఆఫీసు వెళ్ళిన రాధామనోహర్ ను ఎడిటర్ పతంజలి గారు పిలిచి నువ్వేనా ఆ వార్త రాసింది, నిన్ను ఉద్యోగంలోనుంచి తీసేసాం,ఇంకా రేపటి నుంచి రాకు,అనీ చాలా సీరియస్ గా చెప్పారు.ఆ పండ్ల మార్కెట్ చైర్మన్ రెండు కార్లల్లో మనుషులతో వచ్చి బండ బూతులు తిట్టి పోయాడు.వార్త రాసేటప్పుడు ఆ మార్కెట్ చైర్మన్ వెర్షన్ కూడా తీసుకోవాలి కానీ నీ ఇష్టం వచ్చినట్లు వార్త రాసేస్తే ఎలా అని మందలించాడు...సరే నేను బిజీగా ఉన్నాను, రాత్రి పదకొండు గంటలకు కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు.ఆ తరువాత గంట సేపు క్లాసు తీసుకుని, కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు, పతంజలి గారు.....కట్ చేస్తే..
            ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెద్ద పెండ్యాల గ్రామం నెల్లుట్ల రాధామనోహర్ రావుది.నాన్న కమలామనోహర్ రావు తెలుగు లెక్చరర్.పేరుకే తెలుగు లెక్చరర్ గానీ, ఇంగ్లీషు,హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడేవారు.ఇంగ్లీషు,హింది,ఉర్దూ భాషా సాహిత్యాన్ని బాగా చదివేవారు.ఆయన బహు భాషా కోవిదులు. రాధామనోహర్ గారు,నలుగురు చెల్లెళ్ళు,ఒక తమ్ముడు
ఉన్న తన కుటుంబంలో, బాధ్యత కలిగిన ఒకేఒక అన్నయ్య.పందొమ్మిది వందల ఎనభై మూడులో డిగ్రీ
పూర్తి చేసాడు.అప్పుడే వరంగల్ లో పనిచేస్తున్న నాన్న కు ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది.ఆ తరువాత కుటుంబం
అంతా ఖమ్మం వెళ్ళిపోయారు.తాను మాత్రం ఉద్యోగ వేటలో హైదరాబాద్ ట్రయిన్ ఎక్కాడు.డిగ్రీ అయిపోయాక ఒక సంవత్సరం వరంగల్ లోనే సోషల్ టీచర్ గా పనిచేసిన అనుభవం,చేతిలో డిగ్రీ సర్టిఫికెట్,
ఈ రెండు ఆస్తులతో నగరంలోని తన మిత్రుడు దగ్గరకు 
వెళ్ళాడు.అప్పట్లో 
ఆ మిత్రుడు పంజాగుట్ట లోని నిమ్స్ హాస్పటల్ పక్క సందులో రూమ్ తీసుకుని ఉండేవాడు.అతనితో కలిసి
మూడు నెలలు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు.ఏ ఉద్యోగం దొరకలేదు.ఆ తరువాత తన మేనమామ కొడుకు రాధాకృష్ణరావు ముసరాంబాగ్ లో ఉండేవాడు.ఆయన దూరదర్శన్ లో పనిచేసేవాడు.అప్పుడే నేను రిపోర్టర్ గా పనిచేయాలనుకుంటున్నాని,బావ గారితో చెప్పగా చెన్నూరి నాగరాజు నాకు మంచి మిత్రుడు, నేను చెపుతాను నువ్వెళ్ళి కలువు,అని చెప్పాడు.నాగరాజుగారు, అప్పట్లో ఉదయం దిన పత్రికలో పనిచేసేవారు‌.దాసరి గారి తరువాత నెంబర్ టూ పొజీషన్ లో ఉండేవాడు.అలా వెళ్లి ఆయనను కలిసిన వెంటనే దిల్ సుఖ్ నగర్ ప్రాంతానికి స్ట్రింగర్ గా 
ఇచ్చారు.
                స్ట్రింగర్ వ్యవస్థ ఉదయం దిన పత్రిక తోనే
ప్రారంభమైంది.ఆ తరువాత అన్ని పత్రికల వాళ్ళు మొదలు పెట్టాయి‌.దీనిని యూనియన్లు వ్యతిరేకించగా,
స్ట్రింగర్ పేరు కాస్త కాంట్రిబ్యూటర్ గా మారిపోయింది.ఉదయం,ఈనాడు,జ్యోతి పత్రికలు కాంట్రిబ్యూటర్స్ కి లైన్ అకౌంట్ ఇచ్చేవారు.అంటే మనం రాసే వార్తను సెంటీమీటర్లతో కొలిచి,లైన్ అకౌంట్
ఇచ్చేవారు.కానీ ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి దినపత్రికలు
మాత్రం కాంట్రిబ్యూటర్లకు నెలకు ఎనిమిది వందల నుంచి వేయి రూపాయలు ఇచ్చేవారు,అది ఫిక్స్ డు అమౌంట్.ఆ రోజుల్లో అదే పెద్ద మొత్తం, అయితే కాలానుగుణంగా ఈ పత్రికలు కూడా స్ట్రింగర్స్,కాంట్రిబ్యూటర్లను,లైన్ అకౌంట్ పద్దతిలో,ఆయా ప్రాంతాల్లో నియమించారు.
            రాధామనోహర్ ఉదయం కాంపౌండ్ లో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో, స్నేహంగా ఉండేవాడు.అందుకే
రాత్రి పడుకునేటప్పుడు ప్రింటింగ్ డిపార్ట్మెంట్ లో ఆయన కింద పరుచుకొని,మీద కప్పుకునే అంత న్యూస్ ప్రింట్ పేపర్ నీ,ఆయన కోసం ఇచ్చేవారు.అలా టేబుల్స్ మీద పడుకొని,కాంటిన్ లో దొరికిన ఫుడ్ తింటూ చాలా కష్టాలు అనుభవించాడు.ఆ తరువాత
టెంపర్వరీ రిపోర్టర్ అయ్యాడు.అంటే ఆయనకు నెలకు 
వేయి రూపాయల ఫిక్స్డ్ సాలరీ, అన్నమాట.అప్పట్లో
హైకోర్టు న్యూస్ కవర్ చేయమనీ పంపించారు.కానీ వార్తలు రాయవద్దనీ,ఆంక్షలు,అప్పటికే లా డిగ్రీతో ఉన్న
మాడభూషి శ్రీధర్ గారికి ఆ బీట్ ఇచ్చారు.ఆ తరువాత రాధామనోహర్ కి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బీట్ ఇచ్చారు.అప్పట్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామారావు గారు ఉండేవారు.ఆయన రాసిన వార్తలు మేయిన్ పేజీలో వచ్చేవి.వెంకయ్యనాయుడు గారు రాధామనోహర్ అని అనకుండా,రాజా రామ్మోహన్ రాయ్ అని పిలిచేవారు, రామారావు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే, నగరంలోని కరీం ఫంక్షన్ హాలులో ముస్లింలకు, ఇఫ్తార్ విందు ఇచ్చారు.ఆ వార్త ను,ఒక ఆర్టికల్ గా 'పసందైన రాజకీయ విందు' అనే
శీర్షికతో రాధామనోహర్ గారు రాసారు.ఆ ఆర్టికల్ అప్పట్లో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.బీజేపీ పార్టీ, ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఏమిటీ అనీ అందరూ చర్చించుకున్నారు.ఆ తరువాత రామారావు గారు, వేణుగోపాల్ రెడ్డి, మరికొందరు బీజేపీ ప్రముఖులు బీజేపీ తరుపున,నగరం నుంచి పోటీ చేయాలని వత్తిడి
చేసారు, కానీ రాధామనోహర్ గారు సున్నితంగా తిరస్కరించారు.
                    తన కుటుంబ సమస్యల, మూలంగా నెలలో మూడు,నాలుగు రోజులు రాధామనోహర్ ఖమ్మం వెళ్లి వెళ్ళి వస్తుండేవాడు.అది గమనించి బ్యూరో చీఫ్ నుంచి నోటీసులు కూడా వచ్చాయి.అందమైన దస్తూరితో వార్తను విశ్లేషించి, తనదైన శైలిలో రాయడం ఆయన ప్రత్యేకత.
ఒకరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు,రాధామనోహర్ నీ
పిలిచి, దూరదర్శన్ వాళ్ళు చానల్స్ పెడుతున్నారట,దానిపై నాకు ఐటమ్ కావాలి, అని చెప్పాడు.అప్పట్లో, దూరదర్శన్ లోకి ఎంట్రీ చాలా కష్టంగా ఉండేది.ఎలాగో అలాగ లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇరవై అయిదు పేజీల ఐటమ్ రాసిచ్చాడు,రాధామనోహర్.'దూరదర్శన్ చానళ్లు ఉత్తిత్తి మాటేనా'అన్న ఆ వార్త మేయిన్ ఎడిషన్ లో వచ్చి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.రవీంద్రభారతి, త్యాగరాయ గానసభలో,జరిగే కార్యక్రమాలు,ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్స్, ఖైరతాబాద్ లో నీ వాటర్ వర్క్స్ ఆఫీసు వార్తలు,సిటీ కాంగ్రెస్ వార్తలు..ఇలా అనేకం కవర్ చేసాడు,ఆయన రాసిన వార్తలు మేయిన్ ఎడిషన్ లో బైలైన్ తో,వచ్చేవి...కట్ చేస్తే...
                ఒక వార్త రాయాలంటే ఇప్పుడు రిపోర్టర్ కి డబ్బులు ఇవ్వాల్సిందే.ప్రస్తుతం రిపోర్టర్ కి డబ్బులో, అడ్వర్టైజ్మెంట్లో ఇవ్వంది వార్తలు రాయడం లేదు,ఇది వాస్తవం.దానికి 
 కారణం యాజమాన్యాలు.వాళ్ళు సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా నీ జీతాన్ని నువ్వు అడ్వటైజ్మెంట్స్ ద్వారా సంపాదించుకో,అనీ నిర్మొహమాటంగా చెపుతున్నారు.
 చిన్న పేపర్లే కాదు,మంచి సర్కులేషన్ ఉన్న పేపర్ యాజమాన్యాలు కూడా రిపోర్టర్లకు, ప్రతి నెల అడ్వర్టైజ్మెంట్ల టార్గెట్ పెడుతున్నాయి.సరే పోనీ కొన్ని లీడింగ్ పేపర్ రిపోర్టర్లకు ఎంతో కొంత ఇచ్చి వార్త రాయించుకుందామంటే,చిన్నా చితకా పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా,లోకల్ కేబుల్ టీవీ చానెల్ రిపోర్టర్లు.. అందరూ కలిసి వంద మందికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది.ఇటీవల ఒక ఎంఎల్ఏ తన నియోజకవర్గంలోనీ రిపోర్టర్లకు కాక్ టైల్ పార్టీ ఇవ్వాలనుకున్నాడు,పాపం,అంతే ఆయన గుండె ఆగినంత పనైంది.ఆ పార్టీకి మూడు వందల మంది రిపోర్టర్లు హాజరైయ్యారు....కట్ చేస్తే...
               నెల్లుట్ల రాధామనోహర్ రావు రిపోర్టర్ గా తన వృత్తి ధర్మాన్ని చాలా నిబద్ధతతో నిర్వహించేవాడు.నాయకుల నుంచి వార్త రాయగానే డబ్బులు ఆశించడం, వార్త రాయగానే ఆ ఫలానా నాయకుడి ఇంటికి తెల్లవారక ముందే డబ్బుల కోసం కూర్చోవడం, ఇలాంటివి అప్పట్లో కూడా ఉండేవి.కానీ రాధామనోహర్ గారు అలాంటి వాటికి దూరంగా ఉండేవాడు.ఎంతవరకు అంటే ఎవరైనా లీడర్ ఛాయ తాగుదాం సార్ అంటే, వెళ్ళేవాడు కాదు, కారణం ఛాయ తాగితే నేను వారి వార్త రాయాల్సి వస్తుందన్న
అభిప్రాయం.అందుకే ఆయనను ప్రతి నాయకుడు చాలా గౌరవంగా చూస్తాడు.చేతిలో డబ్బులు ఉంటేనే
భోజనం చేస్తాడు, లేకుంటే పస్తులైనా ఉంటాడు కానీ
ఎవరైనా తినిపిస్తానంటే, అస్సలు ఒప్పుకోడు, అప్పట్లో
ఎల్బీనగర్ లోనీ సిరీస్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చే కాలుష్యం వల్ల దాని పరిసర ప్రాంతాల్లో నీళ్ళు థమ్సప్ కలర్ లో వచ్చేవి, అందుకే సిరీస్ ఫ్యాక్టరీనీ,తీసేయాలనీ అప్పట్లో నాయకులు, సామాజిక సంస్థలు ఎన్నో ఉద్యమాలు, నిరాహారదీక్షలు చేపట్టారు.అయినా మేనేజ్మెంట్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు.ఆ తరువాత విలేకరులకు,నాయకులకు మేనేజ్మెంట్ డబ్బులు కూడా
పంచారు.అప్పట్లో ఉదయం పేపర్ కి ఒక క్రేజ్ ఉండేది.
ఈయనకు కూడా డబ్బులు ఇవ్వడానికి ట్రై చేసారు, కానీ ఆయన ఒప్పుకోలేదు.పైగా ఆఫీసులో ఓ పెద్దాయన సిరీస్ లో డబ్బులు పంచుతున్నారు, వెళ్లి తీసుకురా,అంటే నేను వెళ్ళను సార్ అని ఖరాఖండిగా చెప్పేసాడు...అదీ ఆయన నిజాయితికి ఒక నిదర్శనం.
               అప్పటి దిల్ సుఖ్ నగర్ ఇంకా కళ్ళల్లో మెదులుతూనే ఉంది.ఒకవైపు ఆర్టీసీ బస్సు డిపో, జిల్లా బస్సులు ఆగే బస్టాప్, దానికి కొంచెం ముందు నింబోలి అడ్డ రవీందర్ ది బట్టల షాప్,దాని పక్కనే కర్నూల్ రెడ్డి
మధుర స్వీట్ షాప్, అక్కడ మధ్యాహ్నం రిపోర్టర్లు అందరి మీటింగ్ పాయింట్.దాని పైన ఈనాడు పేపర్ ఆఫీసు,ఆ ఆఫీసు పక్కన మంజు ఆడ్స్,దాని ఓనర్ ఒక లెక్చరర్ ఉండేవాడు.దిల్ సుఖ్ నగర్ సెంటర్ కి ఒక వైపు ఇవన్నీ ఉంటే మరో వైపు కోణార్క్ థియేటర్ దాని ఎదురుగా వీఎస్ఎన్ సీను బిల్డింగ్,ఆ బిల్డింగ్ లో నర్సింహా రావు మామ ఆప్టికల్ షాపు, సాయంత్రం కాగానే ఆరు ఫీట్స్ హైట్ ఉన్న జగన్ బావ నర్సింహా రావు మామ ఆప్టికల్ షాపు ముందు మిత్రులతో మాట్లాడడం,తులసి సీను జిరాక్స్ సెంటర్, కోణార్క్ పక్కన చాకలి సత్యనారాయణ ట్రావెల్స్.ఇంకో పక్కన విల్సన్ కేఫ్,రోడ్డు ఫేస్ లో,రామకృష్ణారెడ్డి స్వాగత్ రెస్టారెంట్ దాని పేరు మారి ప్రస్తుతం కినెరా రెస్టారెంట్ అయ్యి నగరమంతా అనేక బ్రాంచ్ లుగా, ఏర్పడింది.జైదీప్ ప్రసాద్ బట్టల షాప్,
సాయిబాబా టెంపుల్,సరూర్ నగర్ పోలీస్ స్టేషన్, బీరప్ప అన్నపూర్ణ కల్యాణ మండపం,ముందు పది షటర్స్, సాయిబాబా టెంపుల్ ఎదురుగా రాజమౌళి గారి రాజధాని థియేటర్..
డిపో పక్కన దుర్గా టెంపుల్,మధుర స్వీట్స్
పక్కన ఆంజనేయ స్వామి దేవాలయం, దానికి ఎదురుగా రాంరెడ్డి వెంకటాద్రి థియేటర్, దాని పక్కనే బీజేపీ లీడర్ మహిపాల్ రెడ్డి షటర్స్, కొత్త పేట సెంటర్ లో,లవ్ బర్డ్ కేఫ్,రోడ్డు వైడనింగ్ లో, రోడ్డుకిరువైపులా,కంకర రాళ్ళు, గుట్టగా పోసిండడంతో,మా చిన్నాన్న మురళీధర్ రావు గారు, తాను,నడుపుతున్న స్కూటర్ అదుపు తప్పి,పడి స్వర్గస్తులై,ఒకరోజు తరువాత గానీ
మాకు తెలిసిన సంఘటన,ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంటుంది.....కట్ చేస్తే...
                   రాధామనోహర్ ఉదయంలో చేరిన సంవత్సరం తర్వాత వివేకానంద కాలనీలో, రూమ్ తీసుకున్నాడు.అప్పటి నుంచి రూమ్ లో వండుకోవడం ప్రారంభించాడు.ప్యూర్ వెజిటేరియన్ అయిన ఆయన రూమ్ లో ,తాను వండిన రుచికరమైన వెజిటబుల్ బిర్యానీ, తిన్న జ్ఞాపకం. ఆ తరువాత పైన నేను చెప్పిన దిల్ సుఖ్ నగర్ లోని అన్ని స్థలాలతో, ఆయనకు కనెక్టివిటీ
ఉంది.అక్కడి షాపు ఓనర్లు,మనుషులు,నాయకులు 
వివిధ పత్రికల రిపోర్టర్లు,ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు,సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ,ఏసీపీలు,
సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ సభ్యులు, మొత్తం మలక్ పేట నుంచి హయత్ నగర్ వరకు ఆయనను గుర్తుపట్టని,ఆయన నిజాయితీ గురించి తెలియని వారంటూ లేరనడంలో, ఏమాత్రం అతిశయోక్తి లేదు.ఒక్కొక్క సారి ఉదయం ఆఫీసు నుంచి రాత్రి తొమ్మిది గంటల తర్వాత దిల్ సుఖ్ నగర్ వచ్చేవాళ్ళం.
దిల్ సుఖ్ నగర్ లో ఈనాడు రిపోర్టర్ రవీందర్ ఉండేవాడు, ఆంధ్ర ప్రభ రమేష్ బాబు, మేం నలుగురం
పదకొండు గంటల వరకు విల్సన్ కేఫ్ లో,మా శిఖరాగ్ర సమావేశం ప్రారంభం అయ్యేది,అది క్లోజ్ కాగానే, వెంకటాద్రి థియేటర్ పక్కన ఉన్న ఇరానీ కేఫ్ కి మా సమావేశ స్థలం మారేది.అది, రాత్రి రెండు గంటల వరకు ఉండేది, అక్కడి నుంచి ఫ్రూట్ మార్కెట్ ఎదురుగా ఉండే ఛాయ బండి దగ్గరకు వచ్చేవాళ్ళం
రెండు నుంచి అయిదు గంటల వరకు అక్కడే మా వాహనాల మీద కూర్చుని ముచ్చట్లు, చివరికి అయిదు
గంటలకు, ఇంటికి వెళదాం అనుకునే సమయంలో, మున్సిపల్ స్వీపర్స్ రోడ్లు ఊడ్చేందుకు వచ్చేవాళ్ళు, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనీ చెక్ చేసేందుకు అప్పటి మున్సిపల్ కాంట్రాక్టర్,సుభాష్ రెడ్డి స్కూటర్ మీద వచ్చేవాడు.ఆ తరువాత ఆయన గడ్డిఅన్నారం మున్సిపాలిటీకీ చైర్మన్ కూడా అయ్యాడు.ఆయనతో కలిసి అందరం రమేష్ బాబు రూమ్ కి వెళ్ళేవాళ్ళం.సుభాష్ రెడ్డి రమేష్ ని,ఒక రాజకీయ గురువుగా,భావించేవాడు...కట్ చేస్తే...
                1995 లో ఉదయం పత్రిక మూసేసాకా,రాధామనోహర్ నగరంలో మెట్ట మొదటగా 
 వచ్చిన స్కాన్ టీవీ- ఇన్ కేబుల్,కేబుల్ టీవీకీ, న్యూస్ డైరెక్టర్ గా వ్యవహరించారు.ఆ తరువాత సిటీ కేబుల్ లో పనిచేసాడు,బైరామల్ గుడలోనీ,ఎంఎస్ఓ ఆఫీస్ లో రాధామనోహర్ న్యూస్ డైరెక్టర్ గా ఉండగా...మేయిన్ సిటీ కేబుల్ లో రవిప్రకాష్ న్యూస్ హెడ్ గా ఉండేవాడు.
ఆ తరువాత వనస్థలి టైమ్స్ వీక్లీ పేపర్ కి ఎడిటర్ గా పనిచేసాడు.బహుముఖ ప్రజ్ఞాశాలి, పుస్తకాలు బాగా చదువుతాడు, స్నేహానికి విలువ ఇచ్చే నెల్లుట్ల రాధామనోహర్ రావు గారు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుకుంటూ...💐🙏🙏💐
                       

కామెంట్‌లు