పుస్తకం....;- ప్రమోద్ ఆవంచ 7013272452

  మస్తిష్క పోషణం....రసపోషణం... ఆనందదాయకం.వర్షం ఆకాశానికి హరివిల్లుతో రంగేస్తుంది.అది వర్ణణాత్మకమైన విస్తరణ. ఆకాశం నీలి వర్ణం.హరివిల్లు లోని ఏడు రంగులను తన చుట్టూ తిప్పుకుంటుంది.ఆ రంగుల వెలుగే మనలోని సృజనాత్మకత.ఆకాశం దేశంలో ఎక్కడో అక్కడ ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది.ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా చెపుతూనే ఉంటుంది.కొత్త ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటుంది. పుస్తకం కూడా అంతే....
పుస్తకం మనలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది...
పుస్తకం ఆకాశమంత విశాలమైనది.పుస్తకం జ్ఞాన నిధి.
                     మా నాన్నగారి లైబ్రరీలో చాలా పుస్తకాలు
ఉండేవి.నేను నాన్న యాదిలో... అన్న కవితలో రాసాను
ఆయన ఒక్కొక్క పుస్తకం కొనడానికి,పస్తులుండాల్సి వచ్చేది.పుస్తకం కొంటే తినడానికి డబ్బులు ఉండేవి కావు,అలా కష్టపడి ఎన్నో విలువైన పుస్తకాలు, ప్రస్తుతం అందులో కొన్ని 
అవుటాఫ్ ప్రింట్.కాలక్రమంలో వాటి కవర్ పేజీలు చినిగి పోతే, బైండింగ్
చేయించి, దానికి ఎంత ఖరీదైనా ఖర్చుపెట్టి,తన లైబ్రరీలో భద్రంగా దాచుకునే వారు.తాను రాస్తున్న సందర్భంలో, రిఫరెన్స్ కోసం ఏదైనా పుస్తకం అవసరం ఉంటే, దాని కోసం తెల్లవార్లూ వెతికే వారు.సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ గారు అన్నట్టు,మా నాన్న రాత్రి ఉదయించే సూర్యుడు.అలా తెల్లవార్లూ తనకు కావలసిన పుస్తకాన్ని వెతికి పట్టుకొని,ఈ లోపల నాలుగు ఛాయలు, నాలుగు సిగరేట్లతో.. తాను రాయాలనుకున్నది,రాసి తెల్లవారుజామున ఆరింటికి 
పడుకునేవారు.నిద్ర సరిపోదు కద,నాన్నారు..అంటే
నాకు ఆరుగంటల నిద్ర సరిపోతుందిరా... అయినా పుస్తకం చదువుతుంటే, అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.నిద్ర గురించి ఆలోచనే రాదు...అని అంటారు.ఒక పదానికి అర్థం దొరకక పోతే,శబ్ద రత్నాకరం, బ్రౌన్ నిఘంటువు, శంకర్ నారాయణ నిఘంటువు, ఉర్దూ- ఇంగ్లీషు నిఘంటువు, ఇంగ్లీషు- సంస్కృతం నిఘంటువు...ఇలా ఇంట్లో ఉన్న పది రకాల డిక్షనరీలను తిరగేసేవారు.మానాన్న టీచర్ గా చేరే కంటే
ముందు కొంతకాలం బస్సు కండక్టర్ గా పనిచేసారు.అప్పుడు వాళ్ళ బస్ డిపోకి వచ్చిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో ఫోటో కూడా దిగారు.ఆ ఫోటో గత పదేళ్ళ కిందటి వరకు ఉండే, ప్రస్తుతం ఫోటో కనిపించడం లేదు.బస్సులో అందరికీ టిక్కెట్స్ ఇచ్చాక, దక్కన్ హెరాల్డ్ పత్రికనో,దక్కన్ క్రానికల్ పత్రికనో, కొనుక్కుని, చిన్న పాకెట్ డిక్షనరీ పెట్టుకుని, అందులోని తెలియని ఇంగ్లీషు పదాలకు అర్థం వెతుక్కునే వారు.అలా ఆయన శ్రద్ధతో, ఇంగ్లీషు నేర్చుకొని,ఆ తరువాత రోజుల్లో అనేక అనువాదాలు చేశారు.ముత్యాల లాంటి హ్యాండ్ రైటింగ్, చాలా చక్కగా ఉండేది.మా చిన్న అత్తయ్య గోదాదేవి,హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుండేదనీ, నాన్న చెపుతుండే వారు,మా నాన్న రాసే, ప్రతి పుస్తకానికి, ఆమె చేతితోనే
ఫెయిర్ కాపీ రాయించేవాడట...
                  ఇంకా మా విషయానికి వస్తే,మా ఇంట్లో,మా అక్కయ్య మంజుల తప్ప ఇంకెవ్వరికీ చదవడం, రాయడం ఇష్టం ఉండేది కాదు.అప్పటికే మా అక్కయ్య నాటికలు,కథలు, కథానికలు చాలా రాసింది ఒక నాటకం ఆల్ ఇండియా రేడియో లో కూడా ప్రసారం అయ్యింది.అప్పట్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు నాటకం ప్రసారం అయ్యేది.ఆ తరువాత నేను అడపాదడపా చదవడం, చిన్న చిన్న బాల కథలు రాసేవాడిని.దాన్ని మొదట మా అక్క చూసాక, ఆమె ఓకే అంటే, నాన్నకు చూపించేది.
                  మా నాన్నకు ఒక భయం ఉండేది,తన తదనంతరం ఈ లైబ్రరీ ఏమయిపోతుంది.కనీసం నా పిల్లలైనా చదవాలి కదా, అని మదనపడుతుండే వారు.
అందుకే ఆయన మాకు ఎప్పుడూ చెపుతుండేవారు...
కనీసం రోజూ పడుకనే ముందు పుస్తకాన్ని దిండు కింద
పెట్టుకొని పడుకోండి,దిండు కింద ఎత్తుగా ఉండి, తలకు కుచ్చుకుంటుంది, అప్పుడైనా నేను చెప్పింది జ్ఞాపకం వచ్చి,ఒకటో అరో పేజీ చదివి పడుకుంటారు.అలా రోజూ చదవడం అలవాటు అయ్యాక, ఏదైనా చదివేంత వరకు నిద్ర పట్టదు...అని చెప్పేవారు.అలా అలవాటు అయ్యింది, చదవడం.ప్రతి రోజు ఏదో ఒక పుస్తకం,అయిదో పదో పేజీలు చదివి కాని,ఆ రోజుని
ముగిస్తాను.
               నేను ఉదయం పేపర్ లో పని చేసేటప్పుడు
ప్రతి ఆదివారం కోటి.. అబిడ్స్ పాత పుస్తకాలు అమ్ముతుండేవాళ్ళు.అది ఇప్పటికీ కొనసాగుతునే ఉంది.తక్కువ ధరలో మంచి, మంచి పుస్తకాలు కొనుక్కొని వచ్చి చదివి,మా నాన్న లైబ్రరీ లో దాచేవాడిని.
అప్పట్లో మా చిన్నాన్న మురళీధర్ రావు గారికి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న బ్రిటీషు లైబ్రరీ లో మెంబర్ షిప్ ఉండేది,ఆయన తన దగ్గర ఉన్న పుస్తకాన్ని ఇచ్చి ఫలానా పుస్తకం తెమ్మని నన్ను పంపేవారు, అలా బ్రిటిష్ లైబ్రరీతో కూడా పరిచయం ఏర్పడింది.మేము సరూర్ నగర్ లో ఉన్నప్పుడు చౌడీ దగ్గర గవర్నమెంట్ లైబ్రరీ ఉండేది.దానికి లైబ్రేరియన్ గా 
ఈనాడు రిపోర్టర్ రవీందర్ క్లాస్ మేట్ ఉండేవాడు.రోజూ అన్ని పేపర్లు చదవడం, అలవాటు అయ్యింది.
                నేషనల్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో
మొదలైన దగ్గర నుంచి నేను వెళుతూనే ఉన్నాను.దాదాపు రెండు వందల స్టాళ్లు.కొన్ని వేల పుస్తకాలు,వందల మంది కవులు, రచయితలు, పుస్తక
అభిమానులతో,ఆ ప్రాంగణం కళకళలాడుతూ ఉంటుంది.ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీన మొదలై జనవరి ఒకటవ తేదీన ముగుస్తుంది.
ఆ బుక్ ఫెయిర్ లో దేశ విదేశాలకు చెందిన పుస్తకాలు,
రోజూ విజ్ఞానదాయక చర్చలు, పుస్తక సమీక్షలు, పుస్తక
ఆవిష్కరణలు, మద్యలో ఆటవిడుపు లా బయట వేడి వేడి తినుబండారాలు, మిత్రుల కలయికలు, సెలెబ్రిటీల
హడావుడిలు ఇంకా ఎన్నో కొత్త పుస్తకాలను కొనుక్కుని
మన లైబ్రరీలో భద్రపరుచుకోవచ్చు.రండి బయలుదేరండి, ఇంకా రెండు రోజులే ఉంటుంది.ఒక ముఖ్య విషయం ఏమిటంటే మీ వెంట మీ పిల్లలను కూడా తీసుకెళ్ళండి, వాళ్ళకు పుస్తకాలు చదవడం అలవాటు చేయండి.ఆదివారం బుక్ ఫెయిర్ లో కలుద్దాం....💐💐💐 
                            
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం